ఆరని సెగలు

ఆరని సెగలు - Sakshi


 టీడీపీలో అసమ్మతి చిచ్చు కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన పక్షులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కష్టపడినవారికి ఫలితం శూన్యమంటూ కింది స్థాయి కేడర్ సెగలు కక్కుతోంది.



పార్టీలో ఎటువంటి పాత్ర పోషించని వారికి టికెట్‌లు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా శివాలెత్తిపోతున్నారు. ఎన్నికలకు పట్టుమని 20 రోజులే ఉన్నా..కొత్తగా వచ్చినవారికి, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారి మధ్య సయోధ్య మాత్రం కానరావడం లేదు.

 

 నర్సీపట్నం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ వలస పక్షులైన గంటా బృందం చేరికను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. మొదట్లో వీరి చేరికపై పత్రికల్లో పలుమార్లు దుమ్మెత్తి పోసిన అయ్యన్న, చంద్రబాబు సాక్షిగా విశాఖలో జరిగిన ప్రజా గర్జనలో సైతం అదే తరహాలో గంటాకు చురకలు అంటించారు. ఆ తరువాత కాస్త సెలైంట్‌గా ఉన్నారనిపించినా మళ్లీ ఆయ్యన్న శివాలెత్తారు. మంగళవారం

 

  నర్సీపట్నం వచ్చిన అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌పై అయ్యన్న ఒంటికాలుపై లేకవడంతో అసమ్మతి చిచ్చు తిరిగి రాజుకున్నట్టయింది. అనకాపల్లి ఎంపీ టిక్కెట్ తన తనయుడు విజయ్‌బాబుకు ఇవ్వాలని అయ్యన్న పలుమార్లు చంద్రబాబును కోరారు. అయితే ఈ సీటు గంటా బృందంలో  సభ్యుడైన అవంతి శ్రీనివాసరావుకు కేటాయించడంతో అయ్యన్న అవాక్కయ్యారు. ఇదేకాకుండా యలమంచిలిలో ఎప్పట్నుంచో పనిచేస్తున్న వారిని కాదని ఆ ప్రాంతానికి పరిచయం లేని పంచకర్ల రమేష్‌బాబుకు టిక్కెట్ ఇచ్చారు.

 

 ఇలా ప్రతికూల పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న అయ్యన్నకు  తన నామినేషన్ కార్యక్రమం ఓ వేదికగా ఉపయోగపడింది. ఉదయమే వచ్చిన అవంతిని చూసి ‘ఎందుకు వచ్చారని’ ప్రశ్నించారు. ఎవర్ని సంప్రదించకుండా ‘ఆయన ఎవరికి టిక్కు పెడితే వారికి మేము పనిచేయడమేనా?’ అని నిలదీశారు. యలమంచిలి గురించి ఏం తెలుసని పంచకర్లకు ఆక్కడ టిక్కెట్టు కేటాయించారని ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ఎంపీకి పనిచేసేదీ?లేనిదీ?  చెబుతామని తేల్చిచెప్పారు.

 

 మరొకడుగు ముందుకేసి ‘మీరు ఇక్కణ్ణుంచి వెళితే మేం నామినేషన్ కార్యక్రమానికి వెళ్తామ’ని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న అవంతి, మీరు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుని ఎమ్మెల్యేగా గెలుపొంది, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేరాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీనిపై స్పందించిన అయ్యన్న ‘నేను గెలిచినా, మీ గ్రూపు సభ్యులు నన్ను మంత్రిని చేసేందుకు అంగీకరిస్తారా?’ అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో భంగపడిన అవంతి శ్రీనువాసరావు ఇంటిదారి పట్టారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top