తిరుగుబావుటా


  •  టీడీపీలో అసమ్మతి సెగలు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు

  •  బెడిసికొడుతున్న బుజ్జగింపు యత్నాలు

  •  తల పట్టుకుంటున్న ముఖ్య నేతలు

  • అభ్యర్థుల్లో గుబులు

  •  

     సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో అసమ్మతి బుసలుకొడుతోంది. సగం నియోజక వర్గాల్లో పార్టీ దిక్కుతోచని దుస్థితి ఎదుర్కొంటోంది. పార్టీ   ముఖ్య నేతలు బుజ్జగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.



    నియోజక వర్గాల వారీగా అసంతృప్తులను దారికితెచ్చే వ్యుహాలు పన్నుతున్నా తిరుగుబాటు నేతలు తమదారి తమదేనని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. దీంతో ఏంచేయాలో అర్థంకాక ముఖ్య నేతలు,అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. ఇలాగైతే తమకు అపజయం ఖాయమని గుబులు చెందుతున్నారు. అనకాపల్లి, యలమంచిలి, పాడేరు, గాజువాక, పాయకరావుపేట, భీమిలి, విశాఖ ఉత్తరం నియోజక వర్గాల్లో పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.

     

     దారికి తేవడం కష్టమే...

    నాన్చినాన్చి తీవ్ర కసరత్తు అనంతరం పార్టీ అభ్యర్థులను ప్రకటించినా టీడీపీలో అసమ్మతి మాత్రం ఉవ్వెత్తున లేస్తోంది. చంద్రబాబు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నియోజక వర్గాల్లో తిరుగుబాట్లు తప్పనిసరవుతున్నాయి. ‘నియోజక వర్గంలో పనిచేసుకోండి టికెటిస్తాం’ అని ప్రతి ఒక్కరికి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పుడు అబద్దాలుగా తేలిపోయాయి. దీంతో ఏళ్ల తరబడి నియోజక వర్గ ఇన్‌చార్జులుగా పనిచేసి డబ్బు ఖర్చుపెట్టిన నేతలంతా ఇప్పుడు తమ సంగతి ఏమిటంటూ నిప్పులు కక్కుతున్నారు. పాడేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి మణికుమారి పార్టీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త నారాయణ ముందు తన నిరసన వెలిబుచ్చారు.

     

     ‘టికెట్ ఇవ్వలేమని ముందే చెబితే మా దారి మేం చూసుకునే వాళ్లం కదా?’ అని ప్రశ్నించారు. కానీ అటునుంచి సమాధానం రాలేదు. అనకాపల్లిలో చాలా కాలం కిందట అయిదుగురు సభ్యులతో ఫైవ్‌మన్ కమిటీ వేశారు. వీరిలో ఒకరికి టికెట్ గా్యారెంటీ అని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు బయటి నుంచి పీలా గోవింద్ అనే కొత్త నేతను తెచ్చి అనకాపల్లి అసెంబ్లీకి రుద్దారు. దీంతో ఇప్పుడు బుద్ధ నాగ జగదీష్, మళ్ల సురేంద్ర వంటి టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాట్లు లేవదీస్తున్నారు. పోటాపోటీగా నామినేషన్లు వేసి పార్టీ అభ్యర్థిని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు.

     

    దీంతో ఇక్కడ అభ్యర్థి ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. చివరకు పార్టీ ముఖ్య నేతలైన ఎం.వి.వి.ఎస్.మూర్తి, నారాయణ కూడా ఏం చేయలేని పరిస్థితి. యలమంచిలిలో నియోజక వర్గ ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్‌ను పక్కనపెట్టి బయటినేత పంచకర్లకు టికెట్ ఇవ్వడం తీవ్రస్థాయిలో నిరసనాగ్నులు రగులుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top