సీఆర్ డీఏ రైతులకు టీడీపీ నేతల బెదిరింపులు

సీఆర్ డీఏ రైతులకు టీడీపీ నేతల బెదిరింపులు - Sakshi


మంగళగిరి (గుంటూరు): భూసమీకరణకు చివరి రోజు గ్రామాలలో పోలీసులు రెవెన్యూ యంత్రాంగంతో పాటు టీడీపీ నాయకులు చేసిన హడావుడి ఆయా గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులను తలపించాయి. శనివారం ఉదయం ఏడుగంటలకే మంత్రి నారాయణ నిడమర్రు గ్రామం చేరుకుని అక్కడ నాయకులకు సూచనలు చేసి అనంతరం తిరిగి వస్తూ అనధికార లేఅవట్‌లను పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఆర్‌డీఏ పరిధిలో అనధికార లేఅవుట్‌ను స్వాధీనం చేసుకుంటామన్నారు. అనధికార లేఅవుట్‌లలో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని, ఇప్పటికే కొనుగోలు చేసిన వారు నష్టపోక తప్పదని హెచ్చరించారు.


అనంతరం అమరావతి టౌన్ షిప్‌లోని తాత్కాలిక రాజధాని కోసం చదును చేసిన స్థలాన్ని పరిశీలించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు భూసమీకరణ కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాలలో భారీగా పోలీసులను తరలించారు. గ్రామ సెంటర్లలో 20 నుంచి 25 మంది పోలీసు బలగాలు మోహరించడంతో గ్రామాల్లో ఏదో జరుగుతుందని భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంతేకాక గ్రామాల్లోని అధికారపార్టీ నేతలు భూసమీకరణకు భూములు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతారని, వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని దుష్పచారం మొదలుపెట్టి రైతుల్లో భయాన్ని సృష్టించి 9.2 ఫారాలు ఇచ్చిన వారిని సైతం బెదిరించి 9.3 ఫారాలు ఇచ్చేవిధంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించారని గ్రామాల్లోని రైతులు ఆరోపించారు. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నియోజకవర్గంలో స్పందన లేకపోవడంతో  అధికారులు, అధికారపార్టీ నేతలు భూములివ్వని వారికి ఫోన్లు చేసి మరీ ఒకసారి అవకాశం పోతే మళ్లీ రాదని, భూసేకరణలో నష్టపోతారని భయపెట్టే కార్యక్రమానికి దిగారు. ఈ విధంగా గ్రామాల్లో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం సృష్టించి చివరి రోజు భూసమీకరణ చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top