మా ఇలాకాలో..మావాళ్లే..

మా ఇలాకాలో..మావాళ్లే.. - Sakshi


సాక్షి, కాకినాడ :జిల్లాలో గతంలో ఎన్నడూ లేని సంకుచిత సంస్కృతికి అధికార తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నేతలు బీజం వేస్తున్నారు. ప్రభుత్వాధికారుల బదిలీల్లో కులానికి పెద్ద పీట వేస్తున్నారు. తమ ఇలాకాలో పని చేసే అధికారులు తమ కులం వాళ్లే కావాలంటున్న వారి దుగ్ధ ఓ దుష్ట సంప్రదాయానికి నాంది పలుకుతోంది. వారిని పీడిస్తున్న ప్రమాదకరమైన కులజాడ్యానికి అద్దం పడుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులను తమ నియోజకవర్గాల్లోకి తెచ్చుకోవాలనుకోవడం పరిపాటే. అయితే నిజంగా ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధి ఎవరైనా.. తన నియోజకవర్గ పరిధిలో పని చేసే అధికారులు జనసేవాతత్పరులై ఉండాలని, నీతినిజాయితీలతో పని చేయాలని కోరుకోవాలి.

 

 ఎవరైనా బదిలీపై వస్తుంటే.. అంతకు ముందు పని చేసిన చోట ఎలాంటి పేరుంది, కష్టించి పని చేస్తారా, లేదా, అక్కడి ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని మన్నిస్తారా, లేదా అనే వాటిపై ఆరా తీయాలి. కానీ పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బదిలీలకు సంబంధించి ఒకవైపు బహిరంగంగానే ‘పోస్టుకు ఇంత’ అని రేటు నిర్ణయించి, సొమ్ము చేసుకుంటూనే మరోవైపు స్వీయ కులానికి అగ్రతాంబూలమిస్తుండడం నివ్వెరపరుస్తోంది. ‘వచ్చే అధికారి ఎంత అవినీతిపరుడైనా ఫర్వాలేదు. నా కులపోడై ఉండాలి. నేను చెప్పిందానికల్లా తలూపాలి’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎస్సైల నుంచి తహశీల్దార్, ఎంపీడీఓల వరకూ ప్రతి శాఖలో, ప్రతి పోస్టులో తమ కులస్థులకే పెద్దపీట వేస్తూ సిఫార్సు లేఖలు ఇస్తున్నారు.

 

 సమర్థులు కాదు..

 అస్మదీయులు ముఖ్యం

 ఈ కుల జాడ్యం ఆ ప్రాంతం, ఈ ప్రాంతమనే తేడా లేకుండా ఇంచుమించుగా అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల న్నింటా కనిపిస్తోంది. ఉదాహరణకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఎస్సైల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకూ కీలకమైన ప్రతి పోస్టులో తమ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యమివ్వాలని అక్కడి ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నారు. సమర్థులైనా వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి కనీసం సిఫార్సు లేఖలు ఇచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షానికి మెజార్టీ ఓట్లు వేశారని భావిస్తున్న సామాజిక వర్గాలకు చెందిన అధికారులను రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అక్కడి ప్రజాప్రతినిధుల సామాజిక వర్గీయులెవరికీ పోస్టింగ్‌లు ఇవ్వడానికి వీల్లేదంటూ ఆ నియోజకవర్గాల టీడీపీ నేతలు పార్టీ అధినాయకుల వద్ద పట్టుబడుతున్నారు.

 

 అనారోగ్యకరమైన సంకేతం

 అయితే కోనసీమలో ఇందుకు భిన్నంగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఒక రిజర్వుడు నియోజకవర్గంలో కీలక పోస్టుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారులను సిఫార్సు చేసేందుకు అక్కడి ప్రజాప్రతినిధి ఆసక్తి చూపడం లేదు. అక్కడ ఎస్సీ సామాజిక వర్గీయులు గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కీలక పోస్టుల్లో ఉండి, కులాభిమానం చూపిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందనే ధోరణి ఆ ప్రజాప్రతినిధిలో కనిపిస్తోంది.

 

 మొత్తం మీద జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనారోగ్యకర ధోరణిని ఆసరాగా కొందరు అవినీతి అధికారులు కులాన్ని సాధనంగా ఉపయోగించి కీలకమైన పోస్టులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ నేతలతో చుట్టరికాలు కలుపుతూ కీలక పోస్టుల్లో పాగా వేయాలని చూస్తున్నారు. కులాన్ని బలహీనపరచడానికీ, అన్ని కులాల నడుమా అనుబంధాన్ని పెంపొందించడానికీ కృషి చేయాల్సిన బాధ్యత తక్కిన వారిపై కన్నా.. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి, పదవిని చేపట్టిన ప్రజా ప్రతినిధులపై ఉంది. అయితే.. వారే మామూలు మనుషుల కన్నా దిగజారి, సొంత కులమే ముఖ్యమన్నట్టు వ్యవహరించడం తాత్కాలికంగా వారికి ప్రయోజనకరమైనా చివరికి సమాజానికి అనారోగ్యకరమైన సంకేతమే.

 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top