వింటే సరి.. కాదంటే గురి

వింటే సరి.. కాదంటే గురి - Sakshi


►  మాట వినకుంటే వీఆర్‌కే..

►  మంత్రిని ప్రశ్నించారని సీఐపై వేటు

►  ముడుపులివ్వలేదని ఎస్సైని సాగనంపారు

►  తెలుగు తమ్ముళ్ల తీరిది




సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పెచ్చుమీరాయి. చివరకు ఖాకీలపైనా జులం ప్రదర్శిస్తున్నారు. వాళ్లు చెప్పిన పనిని వెంటనే పూర్తి చేయకపోయినా వీఆర్‌ తప్పదనే రీతిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇసుక నుంచి మట్టివరకు దేనినీ వదలకుండా అడ్డంగా దోచేస్తూ కోట్లు గడిస్తున్న అధికార పార్టీ నేతలు పోలీసులనూ వదలడం లేదు. మంత్రి కోపానికి కారణమయ్యారని ఒక సీఐని, మామూళ్ల వసూళ్లలో అధికార పార్టీ నేతలకు వాటా ఇవ్వలేదని ఓ ఎస్సైని వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు పంపారు. టీడీపీ నేతలు సాగించిన ఈ రెండు వ్యవహారాలు జిల్లా పోలీస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.



వరుస వివాదాలు.. పోలీసులే బలి పశువులు

టీడీపీ నేతలు నెలన్నరగా పోలీస్‌ శాఖతో వరుస వివాదాలు తెచ్చుకుంటూ చివరకు వారినే బలి పశువుల్ని చేస్తూ.. తమ పంతం నెగ్గించుకుంటున్నారు. వారి చర్యలకు ప్రత్యక్షంగా బలవుతున్న పోలీసు అధికారులు కొందరు ఉండగా, పరోక్షంగా అనేక మంది వారి ఆగడాలతో విసిగిసోతున్నారు. గడచిన రెండేళ్లుగా వసూళ్ల వేట అధికమైంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎస్సైల పోస్టింగ్‌ మొదలుకొని ఇసుక అక్రమ రవాణా వరకు దేనిని వదలిపెట్టడం లేదు. జిల్లాలో గుట్కా, లిక్కర్‌ సిండికేట్ల నిర్వహణ కూడా తెలుగు తమ్ముళ్లదే.



ఈ నేపథ్యంలోనే వారంతా తమ కార్యకలాపాలు సాగించేందుకు నిత్యం పోలీసులపై ఒత్తిడి తెచ్చి మరీ పనులు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలోనే పోలీసులతో అధికార పార్టీ నేతలకు వివాదం రేగింది. గత నెల 20న నెల్లూరు 4వ నగర సీఐ సీతారామయ్యను అకారణంగా వీఆర్‌కు పంపారు. ఆ రోజు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌లో పూలు, పండ్ల వ్యాపారుల షెడ్ల ప్రారంభోత్స కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ క్రమంలో అక్కడ బందోబస్తు విధులకు సీఐ సీతారామయ్య హాజరుకావాల్సి ఉండగా.. అదే స్టేషన్‌ పరిధిలోని వేరే ప్రాంతంలో వివాదం తలెత్తింది.



ఆ ఘటనను చక్కబరచాలని అప్పటి ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశించటంతో సీఐ సీతారామయ్య ఆ ప్రాంతానికి వెళ్లారు. మంత్రి పర్యటనకు ఇద్దరు ఎస్సైలతోపాటు సిబ్బందిని బందోబస్తు కోసం ఉంచారు. ఆ కార్యక్రమానికి వచ్చీ రావటంతోనే మంత్రి అక్కడున్న ఎస్సైలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మినిస్టర్‌ వచ్చినా మీ సీఐ ఇక్కడకు రాడా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ విషయాన్ని ఎస్సైలు సీఐ దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన  ఆక్కడకు వచ్చిన సీఐపై మంత్రి తీవ్ర ఆగ్రహంతో దుర్భాషలాడారు. తానేమీ తప్పు చేయలేదని, మర్యాదగా మాట్లాడాలని సీఐ అనడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తరువాత నాలుగు రోజులకే సీఐను వీఆర్‌కు పంపాడు. అంతటితో ఆగకుండా తమ ప్రభుత్వం ఉన్నంతవరకు పోస్టింగ్‌ ఇవ్వకూడదని ఐజీకి హకుం జారీ చేశారు.



మామూళ్లు ఇవ్వడం కుదరదన్నందుకు..

సూళ్లూరుపేట ఎస్సై జగన్‌మోహన్‌రావు తాను నెలవారీ మామూళ్లు వసూలు చేసి ఉన్నతాధికారులకు, అధికార పార్టీ నేతలకు ఇవ్వలేకపోతున్నాని బహిరంగంగా అనడంతోపాటు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహించి.. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వెంటనే ఆయనను వీఆర్‌కు పంపారు. వాస్తవానికి సూళ్లూరుపేట స్టేషన్‌ గుంటూరు రేంజ్‌ పరిధిలోనే అత్యధిక ఆక్రమ ఆదాయం వచ్చే స్టేషన్‌. నెలవారీ రూ.కోటికి పైగా ఆదాయం వస్తుంది. ఆ మొత్తంలో పోలీసు ఉన్నతాధికారులకు, రాజకీయ నేతలకు వాటా ఇస్తే తమకు మిగిలేదేమీ ఉండదనేది అక్కడి పోలీసుల వాదన. గతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి సాగించిన ఎర్రచందనం వ్యవహారాల్ని బయటకు తీస్తున్నారనే కక్షతో ఒక ఎస్పీనే బదిలీ చేయించిన ఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. సదరు ఎస్పీ కేవలం ఎనిమిది నెలలే జిల్లాలో పనిచేయటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top