సీనియారిటీని పట్టించుకునే వారే కరవయ్యారు


 తీవ్ర స్థాయి

 చర్చకు దారితీసిన నారాయణస్వామి వ్యాఖ్యలు

 తాడోపేడో తేల్చుకోవడానికి

 సిద్ధమనే సంకేతాలు

 ఇన్‌చార్జి మంత్రి

 తీరుపై కార్యకర్తల ఆగ్రహం

 నామినేటెడ్ పోస్టులు

 భర్తీ చేయకపోవడంపై

 అసంతృప్తి


 

 పతివాడ వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో వేడిపుట్టించాయి. పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. నిపురుగప్పిన నిప్పును రాజేశాయి.    ఆయన వంటి సీనియర్ నాయకుడినే పట్టించుకోని పరిస్థితి పార్టీలో ఉందని, ఇక  తమను ఎవరు పట్టించుకుంటారన్న ఆవేదన     వ్యక్తమవుతోంది. పతివాడకు చురకలంటిస్తూ పల్లె రఘునాథ్ రెడ్డి చేసిన కామెంట్‌పై కూడా పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

 

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :ఆయన పెద్దరికాన్ని, సీనియారిటీని పట్టించుకునే వారే కరవయ్యారు. ఏం చేసినా నోరు మెదపరు కదా అని ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. దీంతో  ప్రతి విషయంలో ఆయనకు అవమానాలే ఎదురయ్యాయి.  ఇవన్నీ మాజీ మంత్రి, నెల్లిమర్ల ఎమ్మె ల్యే పతివాడ నారాయణస్వామినాయుడిని ఆలోచనలో పడేశాయి. దీంతో ఆయన  ఆవేదనకు గురయ్యారు.   మినీ మహనాడు వేదికగా  తన బాధను  బయటపెట్టారు.  అందర్నీ విస్మయ పరిచేలా అధిష్టానం తీరును కడిగి పారేశారు.  పార్టీ అధినేత చంద్రబాబు తీరును తప్పుపట్టారు. మౌనంగా ఉంటే విస్మరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

  ఆయన వ్యాఖ్యలతో జిల్లా దేశంలో  వేడిపుట్టింది.     దీనికి తోడు  ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కౌంటర్ ఇవ్వడంపై కూడా పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సముదాయించవలసిందిపోయి  చురకలంటిస్తారా అంటూ పతివాడ వర్గం భగ్గుమంటోంది.    జిల్లాలో అశోక్ గజపతిరాజు తర్వాత సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి ఎందుకో పతివాడను చంద్రబాబు పక్కన పెట్టేశారు. మంత్రి వర్గం కూర్పులో తొలుత  ఆయన పేరు ప్రస్తావిస్తూ, చివరి నిమిషంలో మొండి చేయి చూపారు. ప్రొటెం స్పీకర్‌గా గౌరవించి, కేబినెట్‌లోకి తీసుకోకుండా అవమాన పరిచారు.

 

    ఏడుసార్లు ఎన్నికైన ఈయన్ను కాదని,  మొట్టమొదటి సారిగా ఎన్నికైన ఎమ్మెల్యే మృణాళినికి  మంత్రిపదవి కట్టబెట్టారు. టీటీడీ  బోర్డు మెంబరు పదవి కూడా ఇవ్వలేదు.  ఇలా అడుగడుగునా ఆయనకు అవమానాలే ఎదురయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధేమీ కనిపించలేదు.   ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు.  అందుకే పెద్దాయనకు కోపమొచ్చింది. మినీ మహనాడు వేదికగా ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో  ఫైర్ అయ్యారు.  ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకొచ్చిన ప్రతీసారి విజయనగరం ప్రజలు మంచివాళ్లు, అమాయకులు అంటుంటారని, అందువల్లే ఇక్కడే ఉంచేశారు’ అని పతివాడ పదేపదే వ్యాఖ్యలు చేశారు.  

 

  తన సీనియారిటీని గుర్తించకపోవడం, పదవులు ఇవ్వకపోవడం వల్లే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని   ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంతటితో ఆగకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎత్తిచూపారు.  జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, ప్రభుత్వ వైద్య కళాశాల ఇస్తామని హామీ ఇచ్చాక నేటికీ స్పష్టత లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ వైద్యకళాశాలో...  ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారో  తెలియడం లేదన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు గాని  ప్రజల మాటగా, అభిప్రాయంగా చెబుతున్నానని...  జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా జిల్లా సమస్యల్ని  ఇన్‌చార్జి మంత్రి ఎలా పరిష్కరిస్తారో ఓ కంట కనిపెడుతూనే ఉంటానని పల్లె రఘునాథరెడ్డికి కూడా సుతిమెత్తని చురక అంటించారు.

 

 దీంతో ఇన్‌ఛార్జ్ మంత్రికి, ఎమ్మెల్యేకు పరోక్షంగా మాటల యుద్ధమే జరిగింది. ఈ నేపథ్యంలో పల్లె తన ప్రసంగంలో నాయకులకు ఓర్పు, సహనం, నోరు బాగుంటే ఊరు బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేసి పతివాడకు కౌంటర్ ఇచ్చారు. అయితే, పదవి ఉన్నోడు ఆడిన మాటలవని, పదవి రానోడికి ఉన్న ఆవేదన పతివాడదని, పల్లెకంత సీన్ లేదని పార్టీ వర్గాలు తప్పు పడుతున్నాయి.  పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తమను ఇప్పుడు పట్టించుకునే నాథుడే కరవయ్యాడని జిల్లాలో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదని, ఇంకెందుకు పార్టీలో ఉండాలంటూ పలువురు వాపోతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top