దేశం దాష్టీకానికి పరాకాష్ట

దేశం దాష్టీకానికి పరాకాష్ట - Sakshi


- యల్లమంద సొసైటీ మాజీ ఉపాధ్యక్షుడు కడియాల మృతి

- నరసరావుపేట యువనేత మోసం చేశారనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు

- ఈ సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు

- మరో వైపు మద్యం వ్యాపారులను బెదిరించిన గురజాల నియోజకవర్గ నేత

- గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి లాభాల్లో వాటా ఇవ్వాలని హుకుం

సాక్షి ప్రతినిధి, గుంటూరు : 
పల్నాడులో తెలుగుదేశం పార్టీ నేతల దందాకు సోమవారం జరిగిన రెండు ముఖ్య సంఘటనలు పరాకాష్టగా నిలిచాయి. నరసరావుపేట నియోజకవర్గ యువనేత మద్యం దుకాణం కేటాయింపులో తనకు అన్యాయం చేశాడనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యల్లమంద గ్రామ సొసైటీ మాజీ ఉపాధ్యక్షుడు కడియాల నాగేశ్వరరావు మృతి చెందారు. మరో వైపు గురజాల నియోజకవర్గ నేత అక్కడి మద్యం వ్యాపారులతో గుంటూరులో నిర్వహించిన సమావేశంలో లాభాల వాటాలపై జారీ చేసిన హుకుం వ్యాపారులను ఆందోళనకు గురిచేసింది.



ఇతర పార్టీల మద్యం వ్యాపారులు 50 శాతం, టీడీపీ సానుభూతిపరులు తక్కువ శాతం వాటా ఇవ్వాల్సిందేనని ఆ నేత విస్పష్టంగా ఆదేశించారు. వివరాలు ఇలా వున్నాయి... యల్లమంద గ్రామ సొసైటీ మాజీ ఉపాధ్యక్షుడు కడియాల నాగేశ్వరరావు సోమవారం మృతి చెందారు. మద్యం దుకాణం నిర్వహణకు సంబంధించి యువనేత తనను మోసం చేశారనే ఆవేదనతోనే కడియాల ఆత్మహత్య చేసుకున్నాడని నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ కోడై కూస్తోంది. యువనేత అసమ్మతి వర్గం ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరవేస్తోంది.



బంధువులు నాగేశ్వరరావు మృతదేహాన్ని గ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా నాగేశ్వరరావు గతంలో తనకు లభించిన మద్యం దుకాణం మళ్లీ దక్కేందుకు యువనాయకుడు సహకరించకుండా మోసం చేశారనే మనస్థాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ యువనాయకుడి పేరును ఉదహరిస్తూ సూసైడ్ నోటు రాసాడనే పుకార్లుకూడా బలంగా వినిపిస్తున్నాయి. నాగేశ్వరరావు మృతిపై న్యాయ విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 

గుంటూరులో సమావేశం ....


గురజాల నియోజకవర్గంలోని మద్యం వ్యాపారులు సోమవారం గుంటూరులోని ఆ నియోజకవర్గ నేత నివాసంలో సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యాపారులు తనకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని, టీడీపీ వ్యాపారులు  20 నుంచి 30 శాతం వాటా ఇవ్వాలని  ఆ నేత ఆదేశించినట్టు తెలుస్తోంది. వాటాలు ఇవ్వకపోతే వ్యాపార నిర్వహ ణకు ఇబ్బందులు వస్తాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది. లాటరీ పద్ధతిలో అదృష్టం వరిస్తే రాజకీయపరంగా దురదృష్టం వెన్నాడుతోందని ఈ పరిణామాలను ఉద్దేశించి మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top