టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్


పుత్తూరు :  తెలుగుతమ్ముళ్లు ప్రొటోకాల్‌ను విస్మరించి ఓవరాక్షన్ చేశారు. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం  జరిగిన అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే రోజా హాజరైన ఈ సమావేశానికి ఆస్పత్రి ఇన్‌చార్జ్ డాక్టర్ సబిత, డాక్టర్ రవిరాజులు ప్రొటోకాల్ ప్రకారం తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ తులసీకుమార్, చైర్మన్ కరుణాకరన్, ఎంపీపీ గంజి మాధవయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు కమలమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ పుష్పలతను వేదికపైకి ఆహ్వానించారు. ఆస్పత్రి నివేదికను చదివి వినిపించడంతో పాటు సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు.

 

అయితే అక్కడే డాక్టర్స్ గదిలో వేచి ఉన్న టీడీపీ కార్యకర్తల్లోని ఒకరు గోపాల్‌రెడ్డి సమావేశం మధ్యలో కల్పించుకున్నారు. వైద్యులు వారి సమస్యలను మాత్రమే చెప్పుకొచ్చారని, తాను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నానని, రోగుల సమస్యను మరచి మాట్లాడటం సరికాదని వాదించారు. ఆస్పత్రి అంబులెన్స్      మూడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే వారే లేరని గట్టిగా రెచ్చిపోయారు. ఈ దశలో కౌన్సిలర్, వైఎస్సార్‌సీపీకి చెందిన ఏలుమలై(అమ్ములు) జోక్యం చేసుకుంటూ ప్రొటోకాల్‌ను వ్యతిరేకించి అతనిని ఎందుకు రానిచ్చారని అధికారులపై మండిపడ్డారు.

 

దీంతో మాట్లాడటానికి నువ్వెవరంటూ గోపాల్‌రెడ్డి బిగ్గరగా కేకలు వేయడంతో ఆయనకు అండగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు తోడయ్యారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఇరువర్గాల అరుపులు కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ఒక దశలో రోజా  సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోని  టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులకు సమాచారం వెళ్లింది. ఎస్‌ఐ రామాంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉదయం నుంచే టీడీపీ వర్గీయులు మోహరించినా అధికారులు పట్టించుకోలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top