టీడీపీ నేతల బాహాబాహీ

టీడీపీ నేతల బాహాబాహీ - Sakshi


హిందూపురం :  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ ప్రతి పనికీ రేటు కట్టి కార్యకర్తల నుంచి సైతం డబ్బు లాగుతున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు ఇరు వర్గాలుగా విడిపోరుు కుర్చీలతో కొట్టుకున్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. ఇదంతా బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ సమక్షంలోనే జరిగింది. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో ఉన్న రిచ్‌మెన్ సిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో టీడీపీ మండల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు.



టీడీపీకి చెందిన రైతు సంఘం నాయకుడు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ పీఏ సొంత పార్టీ కార్యకర్తలను సైతం వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీపీ నౌజియాభాను వర్గీయులు ఆయనపై దాడికి దిగారు. చొక్కా చింపివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎంపీపీ మరిది అన్సార్ తదితరులు బ్రహ్మానందరెడ్డిపై దాడికి దిగారు.   

 

గూండా రాజ్యం నడుస్తోంది.. ‘అధికార దర్పంతో ఎంపీపీ వర్గీయులు గూండా రాజ్యం నడిపిస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు చంద్రబాబుకు, ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా చెడ్డపేరు వస్తోంద’ని టీడీపీ రైతు విభాగం నాయకులు బ్రహ్మనందరెడ్డి, రాము తదితరులు అన్నారు. బుధవారం దాడి అనంతరం వారు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తల సమావే శంలో తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే రౌడీల్లా చొక్కా చించి కుర్చీలతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. బోరు వేసుకోవాలంటే రూ.30 వేలు, ఇలా ప్రతి పనికీ రేటు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు.



కార్యకర్తలకు పార్టీలో ఏ కోశాన విలువ లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా జెండా మోస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే గుర్తింపు ఇవ్వలేదన్నారు. తప్పులు ఎత్తి చూపితే ఎంపీపీ వర్గం దాడి చేస్తోందన్నారు. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళతామన్నారు.  దాడి విషయమై పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తామన్నారు.

 

క్రమశిక్షణ చర్యలు తప్పవు..  కార్యకర్తల సమావేశంలో అనుచితంగా ప్రవర్తించిన వారి గురించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని,  క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ మండల కన్వీనర్ రంగారెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశం జరుగుతున్నప్పుడు ఆవేశంతో మాట్లాడరాదని, ఏదైనా ఉంటే సామరస్యంగా చర్చించుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు అన్సార్, పాపన్న, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top