ఏడాదైనా మానని గాయం


సరిగ్గా ఏడాది కిందట అధికార టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు.. అరాచక పర్వానికి అతలాకుతలమైన అంకన్నగూడెం గ్రామం ఇంకా తేరుకోలేదు. ఏడాదైనా వాస్తవ నేపథ్యం ఏమిటో తేలలేదు. కానీ.. పచ్చనేతల కిరాతక దాడులతో బాధిత కుటుంబాలకు అయిన గాయాలు మాత్రం నేటికీ మానలేదు. దాడులకు సాకుగా చూపించిన ఆ గ్రామ సర్పంచ్ రాజేష్ ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పటికీ కుదుటపడలేదు. ఆటవిక దాడులకు పాల్పడ్డ పాత్రధారులు గానీ, దీనివెనుక సూత్రధారులు గానీ ఇంతవరకు అరెస్టు కాలేదు.

 

 అప్పుడేం జరిగిందంటే..

 పెదవేగి మండలం అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ కార్యకర్త చిదిరాల రాజేష్ గతేడాది జూన్ 30న రాత్రి ఊరి పొలిమేర వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. అతనిపై హత్యాయత్నం జరిగిందంటూ మరుసటి రోజు తెల్లవారుజామునుంచే పచ్చచొక్కాలు ఊరిపై తెగబడ్డాయి. గొడ్డళ్లు, బరిసెలు, మారణాయుధాలతో అల్లరిమూకలు స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీటీసీ మొరవినేని భాస్కరరావు ఇంటిపై దాడిచేశారు. టీవీ, ఫర్నిచర్, మంచం, వంటసామిగ్రి, బీరువా.. ఇలా కనబడిన ప్రతి వస్తువునూ పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంటి బయట ఉన్న జీపుకు నిప్పుపెట్టి, బైక్‌ను పక్కనున్న దిగుడు బావిలో పడేశారు. ఈ అకృత్యాలను చూడలేక ఇంట్లో మహిళలు కళ్లు తిరిగిపడిపోగా.. తెరముందు పాత్రధారులు భాస్కరరావుపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

 

 రక్తం ఓడుతున్నా కనికరించలేదు. ఒక్కసారిగా రేగిన అలజడిని చూసి సమీపంలోనే ఉన్న భాస్కరరావు సోదరుడు గోపాలరావు రాగా, ఆయనపైనా విచక్షణారహితంగా దాడికి దిగారు. సోదరులిద్దరినీ బంధించినంత పనిచేసి ఆనక సమీపంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్త సూరిబాబు ఇంటిపైకి వెళ్లారు. అడ్డొచ్చిన మహిళలతో ‘మీ తాళి బొట్లు తెంచేస్తాం. మీ మొగుళ్లను చంపేస్తాం’ అంటూ కత్తులతో స్వైరవిహారం చేశారు. ఇలా మూడుగంటల పాటు టీడీపీ శ్రేణులు దౌర్జన్యకాండ జరిపిన తర్వాత తీరిగ్గా పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలపాటు వీరిని ఎక్కడ ఏ స్టేషన్‌లో ఉంచారో కూడా ఎవరికీ చెప్పకుండా చిత్రహింసలకు  గురిచేశారు. జరిగిన దారుణాలపై ‘సాక్షి’ వరుస కథనాలతో ఎట్టకేలకు దిగొచ్చిన పోలీసులు వారికి విముక్తి కల్పించారు గానీ ఊళ్లోకి మాత్రం వెళ్లడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు.

 

 ఏడు నెలలు ఊరి బయటే

 అప్పటి నుంచి దాదాపు ఏడునెలల పాటు ఇళ్లు, పొలాలు వదిలేసి చెట్టుకొకరు.. పుట్టకొకరు మాదిరిగా కాలం వెళ్లదీసిన ఆయా కుటుంబాలు ఎట్టకేలకు ఊళ్లోకి ప్రవేశించాయి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకున్నాయి. ‘రాజేష్‌తో రాజకీయాలపరంగా బేధాభిప్రాయాలు ఉండొచ్చు. వేర్వేరు పార్టీల్లో ఉన్నాం. అంతేకానీ హత్యాయత్నం చేసేంత విభేదాల్లేవు. అతను మా బంధువే. అయినా ఒకవేళ అతనిపై దాడి చేసే ఉంటే ఎటువంటి రక్షణ లేకుండా ఆ ఊళ్లోనే ఎందుకుంటాం. కేవలం వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే మమ్మల్ని టార్గెట్ చేశారన్నదే బాధితులు మొదటి నుంచి చెబుతున్న వాదన.

 

 సీఐడీ విచారణ చేపట్టాలి

 అంకన్నగూడెంలో దారుణ ఘటన జరిగి ఏడాదైనా మూకుమ్మడి దాడులకు పాల్పడిందెవరు.. దీనికి సూత్రధారులు ఎవరన్నది ఇప్పటివరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. కేవలం వైఎస్సార్ సీపీ కార్యకర్తలన్న కారణంగానే వీరిపై దాడులకు పాల్పడ్డారనేది పోలీసులు కూడా అంగీకరించే వాస్తవం. అయినా సరే అధికార పార్టీ నేతలకు భయపడి దుండగులపై కేసులు కట్టే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో బాధితులు ఆ గ్రామంలో జరిగిన దాడుల ఘటనపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికిందట జరిగిన అరాచకానికి, లక్షల్లో జరిగిన ఆస్తి నష్టానికి, భవిష్యత్‌లో మళ్లీ అలాంటి తరహా దాడులు జరగవన్న నమ్మకానికి ఎవరు జవాబుదారులని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఏలికలు ‘అంకన్నగూడెం’ గాయంపై స్పందిస్తారా.. ఏమో చూద్దాం!

 - జి.ఉమాకాంత్,

 సాక్షి ప్రతినిధి, ఏలూరు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top