దొరకునా ఇటువంటి సేవ..

దొరకునా ఇటువంటి సేవ.. - Sakshi


సాక్షి ప్రతినిధి/తిరుపతి కార్పొరేషన్: మహానాడు.. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ ఇందుకోసం విధులు నిర్వర్తించాల్సిన అవసరం లేదు. పార్టీనే ప్రయివేటు వ్యక్తుల ద్వారా అన్నిపనులూ చేయించుకోవాలి. అయితే అధికారపార్టీ మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. తిరుపతి మున్సిపల్, టీటీడీ, విద్యుత్ ఉద్యోగులకు మహానాడుకు సంబంధించిన పనులను పురమాయిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మౌఖిక ఆదేశాలతో భయపడుతున్న ప్రభుత్వ శాఖల అధికారులు తమ పరిధిలోని దిగువస్థాయి సిబ్బందిని, ఉద్యోగులను కేటాయిస్తున్నారు. కార్పొరేషన్‌కు చెందిన పారిశుధ్య కార్మికులు, తాగునీటి సరఫరా సిబ్బంది, ఇంజినీరింగ్ స్టాఫ్, విద్యుత్ ఉద్యోగులు, కార్పొరేషన్, రెవెన్యూ, బిల్‌కలెక్టర్లందరూ మహానాడు సేవలోనే తరిస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో పరిసరాలను శుభ్రం చేయించడం, తాగునీరు సరఫరా చేయడం, విద్యుత్ బల్బులు, కుర్చీలు ఏర్పాటు చేయిస్తున్నారు.



కొంతమంది ఉద్యోగులకు ప్రొటోకాల్ డ్యూటీలను వేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువ మంది మంత్రుల విడిది ఏర్పాట్ల పనుల్లో ఉన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ఐదుగురు ఎస్పీలు రెండు రోజులుగా మహా సేవలో నిమగ్నమయ్యారు. కార్పొ రేషన్, తుడాలకు చెందిన విలువైన సోఫాసెట్లు, కుర్చీలు, బల్లలతో పాటు ఇతరత్రా ఫర్నీచర్‌ను కూడా మహానాడు ప్రాంగణానికి తరలించారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి ఏసీలు కొనుగోలు చేసినట్లు భోగట్టా. స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు.





 మహానాడుకే ఆరోగ్య సేవలు

 మున్సిపల్ కార్పొరేషన్‌లోని మెజారిటీ పారిశుధ్య కార్మికులు పూర్తిగా మహానాడుకే సేవలు అందిస్తున్నారు.  50 డివిజన్లలో కేవలం 649 మంది కాంట్రాక్టు కార్మికులు, 210 శాశ్వత ఉద్యోగులు, 10 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లున్నారు. వారితో నగరంలో చాలీ చాలకుండా పనులు చేయిస్తున్నారు. అయినా నిత్యం ఎక్కడో ఏదో ఒక సమస్య ఏర్పడుతోంది. అలాంటిది మహానాడుకు ఏకంగా 400 మంది పారిశుధ్య కార్మికులు, 9 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు శానిటరీ మేస్త్రీలను మహానాడు ప్రాంగణానికి ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా నగరంలో పారిశుధ్య సేవలు స్తంభించాయి. ప్రస్తుతం వీరంతా ప్రధాన వేదిక, ప్రధాన గ్యాలరీ, డైనింగ్, కిచెన్, బ్లడ్ బ్యాంక్ ఏరియా, వైద్య ఎగ్జిబిషన్ వంటి కీలక ప్రాంతాల్లో రౌండ్‌ది క్లాక్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరితో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, బిల్‌కలెక్టర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందిని గ్రూపులుగా విభజించి ఒక్కో మంత్రికి కేటాయించారు.   కార్పొరేషన్ ఉద్యోగుల నుంచి సేవలు అందించే బాధ్యతను అదనపు కమీషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం గమనార్హం.  





 టీటీడీ నిధులతో రోడ్లు...

 మున్సిపల్ అధికారులు నగరంలో ఆగమేఘాల మీద తారురోడ్లకు కొత్త సొబగులు అద్దారు. ఇందుకోసం టీటీడీకి చెందిన రూ.40 లక్షలు వాడినట్లు సమాచారం. అంతటితో ఆగని అధికార పార్టీ నేతలు నగరంలోని కపిలతీర్థం, అన్నమయ్య సర్కిల్, గరుడ సర్కిల్ ప్రాంతాలను పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపి పసుపుమయంగా మార్చారు. శ్రీవారి దర్శనార్థం కొండ మీదకు వెళ్లే భక్తుల కోసం కపిలతీర్థం నుంచి గరుడ సర్కిల్ వరకూ  గోవింద నామాలతో ఏర్పాటు చేసిన ఐరన్ ఆర్చ్‌లను ఆక్రమించిన టీడీపీ నాయకులు ఆయా బోర్డులు కనిపించకుండా ఫ్లెక్సీలను, ఫొటో ఫ్రేములను ఏర్పాటు చేశారు. స్వామివారి గోవింద నామ స్మరణాల ఆర్చ్‌లను ఆక్రమించుకోవడం సమంజసం కాదని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సుబ్బన్న పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top