టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం


హైదరాబాద్:టీడీపీ-బీజేపీల మధ్య చోటు చేసుకున్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. 'సాక్షి' ద ఫోర్త్ ఎస్టేట్ వేదికగా సోమవారం కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నేత సోము వీర్రాజుల మధ్య వేడి వేడి మాటల యుద్ధం కొనసాగింది. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలపై రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించగా.. సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబితే.. బీజేపీ పదేళ్ల  ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపిన సంగతిని రాజేంద్రప్రసాద్ ప్రస్తావించారు. ఆ ప్యాకేజీనే ఇప్పుడు ఇవ్వమంటంటే బీజేపీ దానిపై ఎందుకు వెనుకడుగు వేస్తుందన్నారు.




దీనిపై సోము వీర్రాజు ఫోన్ లైన్ లో మాట్లాడుతూ.. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి రూ.ఇరవై వేల కోట్ల కేటాయింపుల్లో పోలవరానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణమాఫీ, భూసేకరణ, ఇసుక అంశాలపై తాము మాట్లాడనప్పుడు మీరెందుకు బీజేపీ వైఖరిని తప్పుబడుతున్నారన్నారు. రాజ్యసభలో టీడీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదని వీర్రాజు తెలిపారు.


 


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఏమైనా మాట్లాడానికి స్థానిక నేతలు సిద్ధం పడటం తగదన్నారు. ఇరు పార్టీలు కలిసి పని చేసినప్పుడు ఎందుకు గందరగోళం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మీరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు, ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూట్ ల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయాన్ని ఓపెన్ రిమార్క్స్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారన్నారు. దయచేసి అర్ధం చేసుకోవాలని రాజేంద్రప్రసాద్ కు సూచించారు. తాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వీర్రాజు మరోసారి తెలపగా.. రాజేంద్ర ప్రసాద్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే సరైన హామీ ఇవ్వలేకపోయారని రాజేంద్ర ప్రసాద్ చురకలంటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top