టీడీపీ నేత.. చిన్నారుల విక్రేత?

టీడీపీ నేత.. చిన్నారుల విక్రేత? - Sakshi


* తన బిడ్డను రూ.20 లక్షలకు అమెరికాలో అమ్మేశాడని ఓ తండ్రి ఆరోపణ

* అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కక్షతోనే ఆరోపణలంటున్న టీడీపీ నేత పాపారావు

* ఆయనపై చాలా ఏళ్ల నుంచి ఇలాంటి అభియోగాలు

* చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరి, పాదయాత్ర చేసిన పాపారావు

 

సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘నేరగాళ్లను తరిమి కొడతా’నని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుంటారు. అదే చంద్రబాబు హత్యకేసులో నిందితులకు టిక్కెట్టిచ్చి, ఎమ్మెల్యేని చేసి శాసనసభలో పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆయన నైజాన్ని గ్రహించే కాబోలు.. పేద, అనాథ పిల్లలను విదేశాలకు అక్రమంగా పంపి, సొమ్ము గడిస్తున్నట్టు ఆరోపణలున్న వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో టీడీపీలో చేరి, కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఆరాటపడ్డారు. సదరు వ్యక్తిపై గతం నుంచీ ఇలాంటి ఆరోపణలున్నా.. సోమవారం నాటి గ్రీవెన్స్‌సెల్‌లో ఓ బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తలకెక్కారు. .

 

ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడిపై ఏకంగా బాలల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్టు ఫిర్యాదులు రావడం కాకినాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో క్రియాశీలక నాయకుడైన కాకినాడకు చెందిన యేల్చూరి పాపారావు తన బిడ్డను అక్రమంగా అమెరికాకు పంపి, రూ.20 లక్షలకు అమ్ముకున్నాడని సీతానగరం మండలం ముగ్గళ్లకు చెందిన పాస్టర్ చింతపర్తి సాల్మన్‌రాజు సోమవారం కాకినాడలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనితో కలెక్టర్ దర్యాప్తునకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు సిఫార్సు చేశారు. సాల్మన్‌రాజు ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి.

 

పదేళ్లుగా పాప ఆచూకీ లేదు..

సాల్మన్‌రాజుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లల చిన్నప్పుడేభార్య నిర్మలకుమారి మృతి చెందింది. చిన్న కుమార్తె సువర్ణను కాకినాడలో ఉన్న తన బావ పాపారావు నిర్వహించచే హాస్టల్‌లో చేర్పిద్దామని తొర్రేడుకు చెందిన కె.మనసయ్య సాల్మన్‌రాజుకు చెప్పారు. దాంతో సువర్ణను పదేళ్ల కిందట ఆమెకు ఐదేళ్ల వయసున్నప్పుడు పాపారావు హాస్టల్‌లో చేర్పించారు. కొన్నిరోజులయ్యాక సువర్ణను అమెరికాలో దొరగారి ఇంటికి పంపిస్తే భవిష్యత్తు బాగుంటుందని పాపారావు సాల్మన్‌రాజుకు చెప్పారు.  

 

ఏటా సువర్ణను భారత్‌కు తీసుకొచ్చి చూపించి తిరిగి పంపిస్తుంటామని నమ్మించారు. పాపను అమెరికా పంపించాక.. తాను ఏనాడు వెళ్లి అడిగినా పాపారావు అతడి మనుషులతో దాడి చేయించే వాడని, తాను ప్రాణ భయంతో పారిపోయి కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పాపారావు అంగబలంతో ఎవరూ పట్టించుకోలేదని సాల్మన్‌రాజు ఆరోపించారు. అప్పటి నుంచీ ఎన్నిసార్లు తిరిగినా సువర్ణ ఆచూకీ లభించలేదని, పాపారావు నుంచి సరైన సమాధానం రాలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను కుమార్తెను పాపారావు రూ.20 లక్షలకు అమ్మేశాడని ఆరోపించారు.

 

కాకినాడ నుంచి పోటీకి యత్నించిన పాపారావు..

ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపారావు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు చంద్రబాబు కేబినెట్‌లో నంబర్-2గా ఉన్న యనమల రామకృష్ణుడు ద్వారా గట్టి ప్రయత్నాలే చేశారు. సీటు ఇస్తే కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్‌లలో ఎన్నికల ఖర్చు అంతా పాపారావే పెట్టుకుంటాడనే ప్రచారం పార్టీలో విస్తృతంగా సాగింది.

 

ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్ ఒకటిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కాకినాడ వచ్చిన చంద్రబాబుకు పాపారావు భారీగా స్వాగతం పలికారు. అప్పట్లో విద్యుత్ సమస్యపై కాకినాడలో లాంతర్లతో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో ప్రస్తుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో పాటు పాపారావు వెంట ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు పాపారావుపై అక్రమంగా మనుషులను రవాణా చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడం తీవ్ర చర్చకు దారితీసింది.

 

అప్పుడే వచ్చిన ఆరోపణలు గప్‌చుప్

పాపారావు మిషన్స్ టు ద నేషన్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కాకినాడ గొడారిగుంటలో న్యూ లైఫ్ పబ్లిక్ స్కూల్, వృద్ధాశ్రమం, ఫౌండేషన్ హాస్పటల్, న్యూ లైఫ్‌పేరుతో ప్రార్థనామందిరంతో పాటు ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. సేవ ముసుగులో సొమ్ము చేసుకుంటున్నాడంటూ.. పాపారావుపై 1996లో కూడా ఇవే రకమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుపేదలను నమ్మించి, వారికి రూ.ఐదు వేల నుంచి రూ.10 వేలు ముట్టచెప్పి వారి బిడ్డలను, అనాథ బాలలను విదేశీయులకు రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.

 

ఈ రకంగా సుమారు వంద మంది పిల్లలను విదేశాలకు పంపించారని ఆరోపణలు వచ్చాయి. పెద్దల జోక్యంతో అవి సర్దుబాటు అయ్యాయంటారు. ఇప్పుడు  మళ్లీ అవేరకమైన ఫిర్యాదు రావడంతో పాపారావు నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది. ఈసారైనా ఆయన చేశాడంటున్న అక్రమ రవాణా నిగ్గు తేల్చుతారో లేక నీరుగారుస్తారో వేచి చూడాలి.

 

డబ్బివ్వలేదని తప్పుడు ఆరోపణ

కాగా ఇల్లు కట్టుకోవడానికి రూ.లక్ష ఇవ్వాలని సాల్మన్‌రాజు తనను అడిగితే నిరాకరించానని పాపారావు అంటున్నారు. ఆ కోపంతోనే తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాడన్నారు. సువర్ణను చట్టబద్ధంగానే ఓ అమెరికన్‌కు దత్తత ఇచ్చినట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top