టీడీపీ నేత.. భూ మేత


సర్కారు భూమి కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. గ్రామ కఠం, దేవుని మాన్యం. పోరంబోకు, పశువుల మేత స్థలం, శ్మశానమైనా సరే కాదేదీ ఆక్రమణలకు అనర్హమంటూ పాగా వేసేస్తున్నారు. అధికార దాహంతో ఊగిపోతున్న కబ్జాదారులతో మనకెందుకనుకుంటూ అడ్డుకోవల్సిన అధికారులే ప్రేక్షకపాత్ర వహించడంతో పరిసరాలన్నీ తమవేననే అహంకారంతో రంకెలేస్తున్నారు. వందల ఎకరాలను పొక్లైన్లతో చదును చేసి ఏకంగా పంట భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నా అడ్డుకునే నాధుడే కానరావడం లేదు. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలంటూ  జిల్లా కలెక్టర్ విజయకుమార్ ఇచ్చిన ఆదేశమూ నత్తనడకన నడుస్తోంది.

 

పీసీపల్లి: అధికారం మనదే ... ప్రభుత్వం భూములూ మనవే అన్న చందంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. కబ్జా చేసి కౌలుకు ఇచ్చేసి సాగు చేసేస్తున్నా సంబంధితాధికారులు చేష్టలుడిగి చూస్తుండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత పది రోజులుగా మండలంలోని చినవరిమడుగులో దాదాపుగా 145 ఎకరాలను టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జేసీబీలు పెట్టి వాగు పోరంబోకు, పశువుల పోరంబోకును ఆక్రమించేస్తున్నాడు.

 

దేవుడి మాన్యమైనా మాదే...

ఒక్క పంచాయతీలోనే దాదాపు 200 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఆక్రమణపాలైందంటే     మండ లం మొత్తం ఎన్ని వందల ఎకరాలు కబ్జాకు గురైందో సమగ్ర దర్యాప్తు చేస్తే వెలుగు చూసే అవకాశం ఉంది. మండలంలోని మురుగమ్మి, గుంటుపల్లి, శంకరాపురం, పీసీపల్లి, పెదయిర్లపాడు, విఠలాపురం, లక్ష్మక్కపల్లి, అలవలపాడు తదితర గ్రామాల్లో ప్రభుత్వ బంజర, దేవుడు మాన్యం, అటవీ పోరంబోకు భూములపై కూడా కన్నేశారు. ప్రధాన నేతే మేత మేస్తున్నప్పుడు ఇక మేమెందుకు వెనుకడుగు వేయాలనుకున్నారేమో చోటా,మోటా నాయకులు కూడా కబ్జాకు సమాయత్తమవుతున్నారు. ఇంత జరగుతున్నా తమది కాదన్నట్లు రెవెన్యూ శాఖ వ్యవహరించడపట్ల గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  కలెక్టర్ ఆదేశంతో పరిశీలించిన సబ్‌కలెక్టర్ పర్యటన రద్దు కావడం వెనుక  రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమోనని పలువురు భావిస్తున్నారు.

 

పిచ్చుకులపై బ్రహ్మాస్త్రాలు...

బతుకు తెరువు కోసం ప్రభుత్వ భూములు ఆక్రమించిన పేదలపై కొరడా ఝళిపిస్తున్న రెవెన్యూ యంత్రాంగం బడా బాబులు జోలికి ఎందుకు పోవడం లేదంటూ పరిసర ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా అధికార యంత్రంగా స్పందించి ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి సెంటు భూమి లేని నిరుపేదలకు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

 

 145 ఎకరాలు పైమాటే...

 చినవరిమడుగు, జంగాలపల్లి, మురుగమ్మిలోని సర్వే నెం 14, 15,16,17 ,70,75,77, 90,148,161,151,153,154,171, 172, 173,174,175లో ఉన్న  145 ఎకరాలను తన సొంత భూమిలా ఐదు జేసీబీలు పెట్టి పది రోజుల నుంచి చదును చేసే కార్యక్రమానికి దిగాడు.

 

 

 70 ఎకరాల్లోనూ...

 పెదవరిమడుగు, పశువులపోరంబోకు, డొంక  పోరంబోకును కూడా వదలడం లేదు. సర్వే నెం-199,200,201,202, 203,189, 190, 185,182,158,153,93ల్లో ఉన్న దాదాపు 70 ఎకరాలు కూడా మూడు నెలలుగా ఆక్రమించి సాగు చేసి కంది పొగాకులను వేశారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో  అదే గ్రామానికి చెందిన కొంతమంది గత నెల 17వ తేదీన ఒంగోలులో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్ విజయకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్, సబ్‌కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top