ఇద్దరు గిరిజన యువతులపై గ్యాంగ్‌ రేప్‌?

ఇద్దరు గిరిజన యువతులపై గ్యాంగ్‌ రేప్‌? - Sakshi


► నిందితుల్లో టీడీపీ నేత, పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారులు

► కేసు లేకుండా పంచాయితీ చేసిన ఊరి పెద్దలు

► తాజంగి జాతరలో కలకలం




సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, చింతపల్లి: విశాఖ జిల్లా ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో జాతర కు వచ్చిన ఇద్దరు ఆదివాసీ గిరిజన యువతులపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. నిందితుల్లో తెలుగుదేశం పార్టీ నేత(ఎంపీటీసీ సభ్యుడు) కుమారుడు, ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు ఉండటంతో ఊరి పెద్దలు కేసు లేకుండా పంచాయితీ చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజంగిలో ఈ నెల 18 నుంచి 20 వరకు పోతు రాజుబాబుల జాతర మహోత్సవం నిర్వహిం చారు. శనివారం చివరిరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక నర్సీపట్నం నుంచి కూడా పెద్దసంఖ్యలో ప్రజలు జాతరకు వచ్చారు.



శనివారం రాత్రి 11 గంటల సమయంలో వర్షం కురవడంతో జాతర  సాంస్కృతిక కార్యక్రమా లకు కొంతసేపు అంతరాయం కలిగింది. దీంతో జాతరకు వచ్చిన  లంబసింగి సమీప గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు దగ్గరలోని పాఠశాల భవనంలో తలదాచుకున్నారు. ఇది గమనించిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి కొడుకు, పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు, మరో ఐదుగురు యువకులు ఆ యువతులపై సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు. అడ్డొచ్చిన యువతుల బంధువులపై దాడికి పాల్పడ్డారు. వీరి చేతిలో దెబ్బలు తిన్న యువతుల బంధువులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఏడుగురు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.



టీడీపీ నేత పంచాయితీ

ఇంతలో పట్టుబడ్డ నిందితుల్లో తమ కొడుకు ఉండటంతో టీడీపీ నేత రంగంలోకి దిగాడు. గ్రామ పెద్దలతో మాట్లాడి పంచాయితీ చేసుకున్నాడు. బాధిత యువతులను వాహనంలో వారి గ్రామానికి పంపించి వేశారు. పోలీసులకు ఫిర్యాదులు, ఎటువంటి కేసులు లేకుండా ఇద్దరు యువతులకూ కలిపి రూ.50 వేలు ముట్టజెప్పాలని పంచాయితీలో నిర్ణయించారు. అనంతరం ఏడుగురు యువకులను మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. నిందితుల్లో టీడీపీ నేత, పోలీస్‌ కానిస్టేబుల్‌ కొడుకులు ఉండటంతో గ్రామ పెద్దలు కాని, పంచాయతీ చేసిన పెద్ద మనుషులు కాని ఎవరూ నోరు మెదపడం లేదు.. ఈ విషయమై చింతపల్లి ఎస్‌ఐ రమేష్‌ను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు గాని సమాచారం గాని అందలేదని తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వద్ద ప్రస్తావించగా..ఎటువంటి సమాచారం లేదని, విచారణ చేసి వాస్తవమని తేలితే నిందితులతో పాటు పంచాయతీ చేసిన పెద్దలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top