టీడీపీలో ర్యాంకుల చిచ్చు

టీడీపీలో ర్యాంకుల చిచ్చు - Sakshi


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ పథకాల అమలు, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేసిన శాసనసభ్యులకు అధిష్టానం ప్రకటించిన ర్యాంకులు జిల్లా టీడీపీలో చిచ్చు రేపుతున్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకున్నవాళ్లు సంబరాల్లో మునిగిపోతుంటే పెద్ద ర్యాంకులొచ్చిన వాళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని గోల ఇప్పుడెందుకంటూ విసుక్కుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం ఓ సర్వే చేయించింది. అది ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, శాస్త్రీయత ఏంటనే విషయంలో స్పష్టత లేనప్పటికీ రుణమాఫీ, ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రప్పించడం, ఆరోగ్య సేవల అంశాల్ని ఆధారంగా చేసుకుని ర్యాంకులిచ్చారనే చెబుతున్నారు.

 

 మూడు రోజుల నుంచీ ఎక్కడ చూసినా ఈ ర్యాంకుల గోలే. ఈ నెల ఒకటో తేదీన విజయవాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఎమ్మెల్సీల్లో కష్టపడినవారికి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. పనితీరు బాగున్నవాళ్లను ప్రశంసిస్తూనే బాగాలేనివాళ్లను సుతిమెత్తగా మందలించారు. అంతేగాదు... వ్యక్తిగతంగా లేఖలు పంపించారు. ఈ లేఖలే ఇప్పుడు తమ్ముళ్ల మధ్య అభిప్రాయభేదాలకు కారణమయ్యాయి.

 

 ఎవరు గొప్ప

 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేల పనితీరుకు కొలమానంగానే ర్యాంకులు ప్రకటించారని చెబుతున్నారు. అయితే పలాస నియోజకవర్గంలో అసలు ఇసుక రీచ్‌లే లేవు. కానీ ఎమ్మెల్యే శివాజీకి ‘ఏడు’పుగొట్టు ర్యాంకు ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా విప్ పదవిలోకి వచ్చిన కూన రవికుమార్‌కు ఎనిమిదోర్యాంకంట. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలున్న పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకే ర్యాంకులు ప్రకటించారు. ప్రతిభాభారతి ఐదులోపు ర్యాంకు తెచ్చుకోలేకపోయారు. శ్రీకాకుళం, టెక్కలి, నియోజకవర్గాలకు ఒకటి నుంచి మూడు ర్యాంకులు ప్రకటించారని మిగతా వాటిలో మాత్రం గందరగోళం నెలకొందంటున్నారు.

 

 సీనియర్లయిన కళా వెంకటరావు, గౌతు శివాజీలకు ఐదు తరువాతి ర్యాంకులిస్తే వాళ్లు అసలు పనిచేయనట్టేనా అని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలున్నచోట  దేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ర్యాంకులివ్వడం వెనుక పారదర్శకత కరువైందని, ఇలా అయితే ఎమ్మెల్యేలను అగౌరవపర్చినట్టేనంటున్నారు. అదే విధంగా మంత్రులకు ఈ ర్యాంకుల ప్రస్తావన చెప్పలేదని అలాంటప్పుడు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు రెండో ర్యాంకు ఎలా సాధ్యం అంటున్నారు.

 

 టీడీపీ ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌చార్జికి ఐదులోపు ర్యాంకులివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీ మారి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శతృచర్లకు సిటింగ్ ఎమ్మెల్యేల కంటే కాస్త ఎక్కువ గౌరవించారని గుర్రుమంటున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో ఎవరూ పనిచేయలేమని తెగేసి చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకూ ఏ ఎమ్మెల్యేకు ఏ ర్యాంకు అన్న విషయం జిల్లా పార్టీ కార్యాలయానికి సైతం తెలియకపోవడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top