ఎత్తులు...పై ఎత్తులు!

ఎత్తులు...పై ఎత్తులు! - Sakshi


 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దం తరువాత దశ తిరిగింది. అధికారం అందివచ్చింది. ఇక పదవులు చేపట్టడమే ఆలస్యం. సరిగ్గా ఇక్కడే టీడీపీలో ఆధిపత్య పోరు ఊపందుకుంది. రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో పార్టీ.. ప్రభుత్వంపై పట్టు బిగించడానికి టీడీపీలో ఇరువర్గాలు నడుం బిగించాయి. ఎత్తులు పై ఎత్తుల్లో నిమగ్నమయ్యాయి. తమ మాట నెగ్గించుకునేందుకు కళా, కింజరాపు వర్గాలు చాపకింద నీరులా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే తమ మనోగతాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లిన ఇరువర్గాలు మహానాడు తరువాత తమ వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నాయి. దాంతో రాబోయే రెండు వారాల్లో టీడీపీ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

 

 ‘కళా’కళలాడకూడదని..

 సీనియర్ నేతగా కళా వెంకట్రావు జిల్లాపై ఆధిపత్యం సాధిస్తారేమోనని కింజరాపు వర్గం కలవరపడుతోంది. ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు జిల్లాలో కళాకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కళాకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ కట్టబెడితే జిల్లా అంతటినీ ఆయన తన గుప్పిట్లో పెట్టుకుంటారన్నది కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన. కళాకు పార్టీ ఎమ్మెల్యేలు శివాజీ, గుండ లక్ష్మీదేవి సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయనకు మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి ఇస్తే జిల్లా లో తమ ఆధిపత్యానికి అడ్డుండదన్నది కింజరాపు వర్గం వ్యూహం. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నవారు ప్రత్యక్షంగా రాజకీయాలు చేయలేరు. అందుకే రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా  చౌదరిలతోపాటు మరికొందరి ద్వారా చంద్రబాబు దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లారు. దీనిపై చంద్రబాబు స్పందన ఇంతవరకు తెలియరాలేదు.

 

 కానీ అచ్చెన్నలో మాత్రం ఆశ మిగిలే ఉంది. మరో సీనియర్ నేత గౌతు శివాజీని అసలు మంత్రివర్గంలోకే తీసుకోవద్దని కూడా కింజరాపు వర్గం గట్టిగా కోరుతోంది. తనకంటే సీనియర్ అయిన శివాజీ మంత్రి అయితే అచ్చెన్నకు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే శివాజీ కాకుండా తానొక్కడినే మంత్రిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. తాను అయితేనే జిల్లాలో పార్టీకి దూకుడుగా ముం దుకు తీసుకువెళ్లగలనని.. శివాజీ ఆ పని చేయలేరని అచ్చెన్న అధినేత చంద్రబాబుకు వివరించారని సమాచారం. ఇలా అటు కళాను తప్పించడం... మరోవైపు శివాజీని ఎమ్మెల్యే పాత్రకే పరిమితం చేయాలన్నది కింజరాపు వర్గం ఎత్తుగడగా ఉంది. తమ సన్నిహితుడైన  చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడం ద్వారా జిల్లాను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నది కింజరాపు వర్గం అసలు లక్ష్యం.  మహానాడు తరువాత ఈ ప్రతిపాదనలను మరింత గట్టిగా చంద్రబాబు వద్ద వినిపించాలని అచ్చెన్న భావిస్తున్నారు.

 

 జెడ్పీ పీఠం పాలకొండ డివిజన్‌కు!

 కింజరాపు వర్గానికి దీటుగానే కళా వెంకట్రావు రాజకీయ వ్యూహానికి తెరతీశారు. తన సీనియారిటీ, అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడిని రంగరించి చాపకింద నీరులా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాను స్పీకర్‌గా వెళ్లనని.. మంత్రిమండలిలోనే చేరుతానని కళా ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. తద్వారా కీలకమైన మంత్రి పదవి చేపట్టేందుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో కింజరాపు వర్గం పాత్రను పరిమి తం చేయడంపైనా దృష్టి సారిం చారు. అచ్చెన్న కంటే గౌతు శివాజీయే మంత్రి పదవికి మెరుగైన నేత అవుతారని కళా అధినేతకు వివరించినట్లు సమాచారం. అచ్చెన్న కంటే సీనియర్ అయిన శివాజీకి ఇవ్వాలని చెబుతున్నారు.

 

 వెలమ సామాజికవర్గం కోటాలో విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, విజయనగరం జిల్లాకు చెందిన కోళ్ల లలితకుమారిలకు అవకాశం కల్పించాల్సి ఉంది కాబట్టి..  శ్రీకాకుళంలో ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు మొగ్గుచూపితే అచ్చెన్నకు మంత్రి యోగం చేజారుతుంది. మరోవైపు జెడ్పీ పీఠం విషయంలోనూ మరో వ్యూహానికి తెరతీశా రు. కింజరాపు వర్గీయుడైన చౌదరి బాబ్జీ సతీమణి ధనలక్ష్మికి కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 పార్టీకి ఎమ్మెల్యేలు లేని పాలకొండ డివిజన్‌కు జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. వాస్తవానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారన్న దానిపై కళాకు పెద్దగా ఆసక్తిలేదని తెలుస్తోంది. కానీ జెడ్పీ పీఠానికి వేరొకరిని ప్రతిపాదించడం ద్వారా అచ్చెన్నను ఆత్మరక్షణలో పడేయాల్నదే ఆయన వ్యూహం. జెడ్పీ చైర్‌పర్సన్ విషయంలో అచ్చెన్న పట్టుబడితే మంత్రి పదవి విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాకుండా పోతుంది కదా అన్నది కళా ఎత్తుగడగా ఉంది.  ఈ నేపథ్యంలో మహానాడు అనంతరం కింజారపు, కళా వర్గాలు హైదరాబా ద్ కేంద్రంగా తమ రాజకీయ వ్యూ హాలకు పదును పెట్టనున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top