టీడీపీలో భగ్గుమన్న వర్గ విబేధాలు

టీడీపీలో భగ్గుమన్న వర్గ విబేధాలు - Sakshi

► పేట్రేగిన కన్నబాబు వర్గీయులు

► ఆనం అనుయాయుల కరకట్టను తగులబెట్టిన వైనం

► పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బాధితులపై దాడి

 

నెల్లూరు‌‌: టీడీపీ వర్గవిభేదాల్లో ఓ వర్గం పేట్రేగిపోయింది. తమకు జరిగిన అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నవారిని స్టేషన్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. రాళ్లు, రాడ్లతో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 

 

బాధితుల కథనం మేరకు.. పెద్దబ్బీపురం గ్రామానికి చెందిన ఆనం వర్గీయులైన అల్లంపాటి సీతారామిరెడ్డి, ఉమ్మడిశెట్టి వెంగయ్యలకు చెందిన నిమ్మ, మామిడి తోటల చుట్టూ ఉన్న కరకట్టను కన్నబాబు వర్గీయులైన మాధవరెడ్డి తదితరులు మంగళవారం ఉదయం తగులబెట్టారు. వెంటనే ఈ విషయాన్ని బాధితులు స్థానిక సర్పంచ్‌ తగరపు మాలకొండయ్యకు తెలిపి ఆత్మకూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్‌ గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న సమయంలోనే సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఈ విషయమై సమావేశం నిర్వహించారు.

 

కరకట్ట తగులబెట్టిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించి ఆ మేరకు సీతారామిరెడ్డి, వెంగయ్య, సర్పంచ్‌ తగరపు మాలకొండయ్యలు కారులో ఏఎస్‌పేటలోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్న  విషయం తెలుసుకున్న కన్నబాబు వర్గీయులైన మాధవరెడ్డి, ఊసా మాలకొండయ్య, కొండాస్వామి, బొమ్మినేని చినవెంగయ్య, నరసయ్య, మధుసూదన్, ఊసా రవి తదితరులు మరో కారులో పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. బాధితులు స్టేషన్‌లోకి వెళ్తుండగా ముందుగానే కారులో తమ వెంట తెచ్చుకున్న రాళ్లు, రాడ్లతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వెంగయ్య, సీతారామిరెడ్డిల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది.

 

సర్పంచ్‌ మాలకొండయ్యకు ఓ మోస్తరు గాయాలు కాగా తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర గాయమైన వెంగయ్య పరుగున పోలీస్‌స్టేషన్‌ లోపలకు వెళ్లి పడిపోయాడు. ఆ సమయంలో ఎస్సై నెల్లూరులో క్రైం మీటింగ్‌కు వెళ్లారని పోలీసులు తెలిపారు. కేçసు నమోదు చేసుకుని బాధితులను చికిత్స కోసం ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాడి చేసిన వారు గతంలోనూ తమ తోటల్లోని నిమ్మ, మామిడి నరికి వేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేందుకు ఒడిగట్టారని బాధితులు వాపోయారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top