సొమ్మొకరిది..సోకొకరిది !

సొమ్మొకరిది..సోకొకరిది ! - Sakshi


► కైజాలా యాప్‌.. ప్రభుత్వానిదా..టీడీపీదా?

► నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వినియోగం

► యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం 2 వేల మంది నియామకం

► ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ అప్‌డేట్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలు  

► అధికార దుర్వినియోగం కిందకు వస్తుందన్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు




సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుంది కైజాలా యాప్‌ పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం వినియోగించాల్సిన ఈ యాప్‌ను నంద్యాలలో  తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల కోసం ఉపయోగిస్తోంది. ప్రభుత్వానికి చెందిన యాప్‌ను టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచార కోసం వినియోగించడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.



నంద్యాల : నాలుగు నెలల క్రితం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కైజాల యాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలన వ్యవహారాలు, ఇతర వివరాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఈ యాప్‌ను వినియోగించాలని రూపొందించారు. అంతేకాక దీనిని సీఎం డాస్‌ బోర్డుకు కూడా అనుసంధానం చేశారు. దీని ద్వారా వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేకాధికారులను కూడా నియమించారు.   



ప్రతీ ఆండ్రాయిడ్‌లో కైజాలా యాప్‌ ఉండాలన్న సీఎం

సీఎం చంద్రబాబునాయుడు కైజాలా యాప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ఈ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి దీనిని బలమైన ప్రచార సాధనంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాకు 150 మందిని రూ.20 వేల ప్రభుత్వ జీతంతో నియమించారు.



వీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్న వారిని కలసి కైజాలా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించే విధానాన్ని వివరించాల్సి ఉంటుంది.

అంతేకాక వారి మొబైల్‌ నంబర్‌ను కూడా తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 వేల మందిని నియమించారు. వీరికి నెలకు దాదాపు 4 కోట్ల రూపాయలను జీతంగా ఇస్తున్నారు. అందులో భాగంగా నంద్యాలలో కైజాలా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తూ పలువురు యువకులు కనిపిస్తున్నారు.  



ప్రతిపక్ష నేతలను కించపరచే వీడియోలు, ఆడియోలు..

కైజాలా యాప్‌ పూర్తిగా ప్రభుత్వం రూపొందించినది. ఇందులో ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవచ్చు. వాటిలో లోపాలను సవరించేందుకు ప్రజల నుంచి వినతులను స్వీకరించవచ్చు. అయితే నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం కోసం వినియోగించడం...అందులో ప్రతిపక్ష నేతలను కించ పరిచే వీడియోలు, ఫొటోలు, ఆడియోలు పెట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 



మరీ ముఖ్యంగా యాప్‌లో ప్రతిపక్ష నేతలను కించపరచే విధంగా ఫొటోలు, వీడియోలు అప్‌డేట్‌ అవుతుండడంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.



అధికార దుర్వినియోగం..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలన వ్యవహారాలు, ఇతరత్రా వివరాల ప్రచారం కోసం ప్రారంభించిన ఈ యాప్‌ను ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా వాడుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల నియమావళిని అతిక్రమించడమేనని, ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలని కోరుతున్నారు. అవసరమైతే దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top