పార్టీ ఫండ్ ఇస్తే ఓకేనా?

పార్టీ ఫండ్ ఇస్తే ఓకేనా? - Sakshi


 ఏ చిన్నపాటి పనిచేసినా నాకెంత మిగులుతుంది.. అని లెక్కలు వేసుకుని పనులు చేసే ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు ఇటీవల మొక్కల నాటే కార్యక్రమం పేరిట లక్షలాది రూపాయలు మింగేశారట. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ బాగోతాన్ని పరిశీలిస్తే... పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం కింద నగరంలోని అన్ని డివిజన్లలోనూ మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ఆ కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి 10వేల మొక్కలు రప్పించి డివిజన్‌కు 200 చొప్పున 50 డివిజన్లలో పంపిణీ చేశారు.

 

 ఇంతవరకు బాగానే ఉన్నా సదరు మొక్కల పంపిణీ జమా ఖర్చుల్లోనే సంబంధిత అధికారులు మాయాజాలం చేశారట. వాస్తవానికి ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున రూ.50వేలు ఖర్చు కాగా, అధికారులు మాత్రం మొక్కకు 20 రూపాయల చొప్పున రూ.2 లక్షలకు బిల్లు చూపించేశారట. అంటే రూ.లక్షన్నర నొక్కేశారన్నమాట. పచ్చదనం వెల్లివిరిసేందుకు ప్రభుత్వం చేపట్టిన చిన్నపాటి మొక్కలు నాటే కార్యక్రమంలోనే లక్షలు బొక్కేస్తే నగరపాలక సంస్థలో అవినీతి ఏస్థాయిలో వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘మాకు డబ్బు మీద ఆశలేదు.. బాగా చేశామని పేరొస్తే చాలు’ అని పదే పదే చెప్పుకుంటున్న పాలకులు ముందుగా నగరపాలక సంస్థను పట్టిపీడిస్తున్న అవినీతి, అక్రమాలపై దృష్టి పెడతారా..  ఏమో చూద్దాం.

 

 పార్టీ ఫండ్ ఇస్తే ఓకేనా?

 అధికార తెలుగుదేశం, మిత్రపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభించిన బీజేపీ వచ్చే నెల నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టేం దుకు సన్నాహాలు చేస్తోంది. టీడీపీ అధిష్టానం సభ్యత్వ నమోదుకు నామినేటెడ్ పదవుల పందేరంతో ముడిపెట్టడంతో పార్టీ శ్రేణులు ఈ పనిని విచ్చలవిడిగా చేసేస్తున్నాయి. ఒక్కో సభ్యత్వానికి రూ.వంద తీసుకుంటూ రూ.2 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇలా తాయిలాలతో సభ్యత్వ నమోదును తారస్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ నేతలు ‘మా పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే చాలు.. మీరేం చేసినా మేముంటాం’ అని భరోసా ఇస్తున్నారట. ‘చివరకు తప్పు చేసినా సరే..’ అన్న భావనను కల్పిస్తున్నారట. ఇందుకు ఇటీవల ఏలూరులో చోటుచేసుకున్న ఆటోనగర్ వివాదాన్ని కొందరు నేతలు ఉదాహ రణగా ఉటంకిస్తున్నారు. నగరంలో నెల రోజులుగా ఆటోనగర్ స్థలాలపై వివాదం నలుగుతున్న సంగతి తెలి సిందే.

 

 అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో మొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంటికి పోలీ సులు సోదాలకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు కట్టకట్టుకుని అక్కడ వాలారు. వారంతా మాగంటికి బహిరంగంగా మద్దతివ్వడానికి బలమైన కార ణం లేకపోలేదని అంటున్నారు. ఇటీవల జరి గిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆటోనగర్ పెద్దలు తెలుగుదేశం పార్టీకి రూ.40 లక్షల్ని ఫండ్ ఇచ్చారట. కేవలం ఆ కృతజ్ఞతతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వ యంగా ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించారని అంటున్నారు. అంతేనా.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి అరెస్ట్‌ను కూడా అడ్డుకున్నారన్న ప్రచారముంది. అంటే అధికార పార్టీకి ఫండ్ ఇస్తే.. తప్పు చేసినా మీ వెనుక మేముంటాం అనే సంకేతాల్ని నేతలు క్యాడర్‌కు అందించారని అంటున్నారు. ప్రజలూ.. చూస్తున్నారా ఈ విడ్డూరం.

 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top