వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా కేసులు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా కేసులు - Sakshi


అమరావతి: నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షం వైసీపీని బలహీన పరిచేందుకు అక్రమాలకు తెరతీస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు బనాయిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ ఎంఎల్ఏల విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నట్లు కనబడుతోంది. నంద్యాల ఉపఎన్నిలో గెలవడానికి వ్యూహాలు పన్నుతున్నట్లు అనుమానం ప్రజల్లో వస్తోంది. వైఎస్సార్సీపీ ఎంఎల్ఏల్లో వీలైనంతమందిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచే ప్రయత్నాలను చేస్తోంది. తాజా పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా అలాంటి అనుమానం రాకుండా మానదు. మొన్ననే చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మంగళవారం మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.



వివరాల్లోకి వెళ్తే తిరుపతి సమీపంలోని సి రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇందుకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామస్తులతో పాటు ఆందోళన చేశారు. అదే అదునుగా భావించిన ప్రభుత్వం చెవిరెడ్డిపై కేసులు పెట్టి రిమాండ్కు తరలించారు. తాజాగా సీఆర్డీఏ అధికారులు మంగళవారం రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో గ్రామసభ నిర్వహించారు. వాస్తవంగా అక్కడ జరిగే విషయాలను మినిట్స్ బుక్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు అలా చేయలేదు. దీంతో రైతులు, స్థానికులు తమ అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రికార్డు చేయాలంటూ పట్టుపట్టారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో రైతులు, స్ధానికులు టెంట్లను పీకేసి, కుర్చీలను విసిరేసారు. అక్కడి నుండి వెళ్ళిపోయిన అధికారులు రాత్రి రైతులు, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టారు.



ఇక్కడే ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. సి రామాపురం గ్రామంలో చెవిరెడ్డిపైనా,  పెనుమాక సీఆర్డీఏ సమావేశ విషయంలో ఆళ్లరామకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల వాదన. అయినా పోలీసులు ఎంఎల్ఏలపైన కూడా కేసులు పెట్టారంటేనే సర్వత్రా అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలు మొదలయ్యే నాటికి వీలైనంతమంది ప్రతిపక్ష ఎంఎల్ఏలపై కేసులు నమోదు చేస్తే అవసరం వచ్చినపుడు అరెస్టులు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. దాంతో ఉపఎన్నికల్లో ఎల్ఏలు ప్రచారం చేసే అవకాశం లేకుండా చేసివైఎస్సార్సీపీని బలహీన పరచవచ్చు అనే ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top