బాబు పాలనపై తిరగుబాటు

బాబు పాలనపై తిరగుబాటు - Sakshi


* టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా

* అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు

* ఆగ్రహంతో కార్యాలయంపై దాడి

* ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం

* కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం

* ఎమ్మార్పీఎస్ నాయకుల అరెస్టు


నెల్లూరు (సెంట్రల్): సీఎం చంద్రబాబు మాట తప్పారంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు సర్కారుపై తిరగబడ్డారు. దళితులను నమ్మించి మోసం చేశారంటూ ఆందోళనకు దిగారు. తమ బాధను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని చంద్రబాబు తీరుకు నిరసనగా సోమవారం నెల్లూరులోని మినీబైపాస్‌రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను, కార్యాలయం అద్దాలను, కుర్చీలను ధ్వంసం చేశారు.



ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టాక వాటిని మరిచారన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీరు మోసపూరితంగా ఉందన్నారు. దళితుల వల్లే అధికారం చేపట్టిన చంద్రబాబు ఈ రోజు దళితులను చిన్నచూపు చూడటం ఎంత వరకు సమజసం అంటూ ప్రశ్నించారు. గత చంద్రబాబు పాలనలో కూడా దళితులపై కక్షసాధింపు చర్యలు చేపట్టారన్నారు.



మారాను అని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయనను దళితుల ద్రోహిగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజ లు ఎప్పటికీ చంద్రబాబును క్షమించరని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై బాబుది ఎన్నికల ముందు ఒక మాట అధికార వచ్చిన తరువాత మరొక మాటగా ఉందన్నారు. పోలీసులతో బెదిరించినా సరే తమకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలనుకుంటే రాష్ర్టవ్యాప్తంగా దళితులంతా ఏకమై పె ద్దఎత్తున ఉద్యమాలు చేపడతారన్నారు. ఇక జీవితంలో ఎప్పటికీ చంద్రబాబుకు అధికారం రాదని శాపనార్థాలు పెట్టారు. కాసేపటికి  పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

 

12మంది ఎమ్మార్పీఎస్ నాయకులు అరె స్ట్

నెల్లూరు(క్రైమ్): టీడీపీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచిన కేసులో ఎమ్మార్పీఎస్ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు, రమేష్, మందా పెంచలయ్య, గంపాల నాగేశ్వరరావు, మంచు వేణుగోపాల్, ఇండ్ల రామచంద్రయ్య, పెంచలయ్య, వెంకయ్య, బద్దెపూడి వివేక్, కృష్ణకిశోర్, గోపీతో పాటు ఎమ్మార్పీఎస్‌పొలిట్‌బ్యూరో సభ్యుడు జి. శ్రీనివాసును అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం నిందితులపై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదుచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top