పక్కా స్కెచ్‌తో ప్రలోభ పర్వం..

గాజులపల్లిలో ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన కంటెయినర్‌ - Sakshi

నంద్యాలలో ఓటమి భయంతో టీడీపీ అక్రమాలు

 

- నోట్ల కట్టలతో ఓటర్లను లొంగదీసుకునే వ్యూహం

దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేసే యత్నం

అన్ని అభాండాలనూ ప్రతిపక్షంపై మోపే పథకం

డబ్బు పంపిణీ షురూ..ఓటుకు రూ.5వేలు నుంచి రూ.10వేలు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్చగా పంపిణీ

పోలీసులకు సమాచారం ఇచ్చినా అటువైపు వెళ్లని వైనం

రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఒక్కరోజే వందల కోట్లు రాక

నోట్ల కట్టలను చూసి ముక్కున వేలేసుకుంటున్న అధికారులు

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ అధికారపక్షం నిజస్వరూపం మరింత స్పష్టంగా బయటపడుతోంది. డబ్బు, దౌర్జన్యాలు, అభాండాలు.. ఈ మూడు అంశాలను ఆధారం చేసు కుని ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవడానికి అది పావులు కదుపుతోంది. గెలవడానికి గల అవకాశాలు సన్నగిల్లుతున్నాయని గ్రహించిన అధికారపార్టీ అడ్డదారులను ఆశ్రయిస్తోంది. ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదిరోజులుగా వాడవాడలా తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండడం, పెద్ద ఎత్తున ప్రజాస్పందన కనిపిస్తుండడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని అధికారపార్టీ డబ్బు, దౌర్జన్యాలను, అభాండాలను అస్త్రాలుగా చేసుకుంటోంది.



అభిమానంతో హాజరవుతున్న జనాన్ని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక ఎత్తులు వేస్తోంది. జేబులో మూడువేలు, నాలుగు వేలు ఉన్నవారిని కూడా పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం, కేసులు పెట్టడం అందులో భాగమేనని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హోటల్‌లో కూర్చుని భోజనం చేస్తున్నవారిపైన కూడా దౌర్జన్యం చేయడం అధికారపార్టీ దుర్మార్గాలకు పరాకాష్ట అని వారు విమర్శిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా బరితెగించి మరీ డబ్బు పంపిణీకి తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మరీ ఘోరమైన విషయమేమిటంటే  పోలీసుల వ్యాన్లలోనే టీడీపీ కౌన్సిలర్లు తిరుగుతున్న విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు.



మంత్రుల వాహనాలలో కూడా డబ్బు సరఫరా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు రానున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే హామీల వర్షం కురిపించారు. ఎన్నికల నియమావళి అమలులో  ఉండడంతో కొత్త హామీలు ఇవ్వలేరు కనుక  ప్రతిపక్షంపై అభాండాలు వేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

 

సోదాలు.. స్వాధీనాలు.. అభాండాలు

ఎన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నా ఓటర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో అధికారపార్టీ నేతలు త్రిముఖ వ్యూహాన్ని రచించారు. విచ్చలవిడిగా డబ్బు పంచడం, దౌర్జన్యాలతో అందరినీ భయభ్రాంతులకు గురిచేయడం, అన్ని రకాల అభాండాలను ప్రతిపక్షంపై మోపడం వంటి అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే రకరకాల పద్దతుల్లో నంద్యాలకు చేర్చిన కోట్ల రూపాయలను శుక్రవారం వెలికి తీశారు. నంద్యాల పరిధిలో రహస్యప్రాంతాల్లో దాచి ఉంచిన డబ్బును ఓటర్లకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. డబ్బుల పంపిణీ ప్రారంభించటంతో మరింత నగదు అవసరం అవుతుందని రాష్ట్ర రాజధాని నుంచి కూడా భారీ ఎత్తున నగదును నంద్యాలకు దిగుమతి చేసుకుంటున్నారు. తాము డబ్బులు పంపిణీ చేసుకునేందుకు వీలుగా ముందస్తు పథకం ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తరుపున ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం చేయించారు.



అందులో భాగంగా నంద్యాలలో ఉన్న కొందరిని పోలీసుల ద్వారా పట్టుకున్నారు. వారి నుంచి భారీ ఎత్తున నగదుని స్వాదీనం చేసుకున్నట్లు ప్రచారం చేయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, పార్టీతో సంబంధం లేని వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని పెద్ద ఎత్తున హడావుడి చేశారు. వీరి నుంచి రూ.4.02లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో అనేక మంది సొంత అవసరాల కోసం తెచ్చుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. అయినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీగా డబ్బులు పంచుతున్నట్లు తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని తెచ్చిన మొత్తాన్ని కూడా సీజ్‌ చేశారు.



ఆధారాలు చూపించినప్పటికీ పట్టించుకోలేదు. ఒకవైపు అధికారపార్టీ విచ్చలవిడిగా డబ్బుల మూటలు వెదజల్లుతుంటే... వీటి వైపు కన్నెత్తి చూడని అధికారులు, మరోవైపు పదివేలు, ఇరవైవేలు పట్టుకుంటూ హడావుడి చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు బస చేస్తున్న లాడ్జిలల్లో ఇప్పటికే రెండు, మూడు సార్లు సోదాలు నిర్వహించిన అధికారులు... అధికారపార్టీ బస చేసిన లాడ్జీలల్లో మాత్రం కనీసం సోదాలు నిర్వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

టీడీపీ నేతల బరితెగింపు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు... అధికారయంత్రాంగం దృష్టిని మళ్లించి టీడీపీ నేతలు డబ్బులు, గృహోపకర వస్తువులు వంటివి పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం గోస్పాడు మండల పరి«ధిలో డబ్బుల పంపిణీ ప్రారంభించారు. రాయలసీమ జిల్లాకు చెందిన ఎంపీ, మరో మాజీ ఎంపీ కలిసి ప్రచారం చేస్తున్నట్టు నటిస్తూనే నగదు పంపిణీ కానిచ్చేశారు. ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేశారు. గోస్పాడుకు చెందిన ఓ వ్యాపారి నివాసంలోని 10 ఓట్లకు రూ.5వేల చొప్పున ఇచ్చినట్లు ఆ వ్యక్తి మీడియాకు సమాచారం ఇచ్చారు. అదే వధంగా నంద్యాల రూరల్‌ పరిధిలో నూనెపల్లి పరిధిలోని ఠాగూర్‌ స్కూల్‌ పరిసర ప్రాంతంలోని ఓటర్లకు మొదటి విడతగా రూ.2వేల చొప్పున పంపిణీ చేశారు. ఇంకా కానాల, బాబానగర్‌లో విస్తృతంగా డబ్బులు పంపిణీ చేశారు.

 

పట్టణంలో వీధి వీధిన పంపిణీ జాతర

నంద్యాల పట్టణం వీధికి 5 మంది చొప్పున ఇంటింట తిరిగి డబ్బులు పంపిణీ చేయటం కనిపించింది. దేవనగర్, 25వ వార్డు పరిధిలో నగదుతో పాటు ఉచితంగా భీమా చెల్లించి చంద్రన్న భీమా కార్డులు పంచిపెట్టారు. 10వ వార్డు పరిధిలో టీడీపీ నేతలు ఆటోల్లో డబ్బులు తీసుకుని ఇంటింటికి తిరిగి డబ్బులు పంచిపెట్టారు. ఇక్కడ కొందరికి రూ.3వేలు, మరి కొందరికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రూ.3వేలు ఇచ్చి... పేదవారైన తమకు వెయ్యి రూపాయలు ఇస్తారా? అంటూ ఓ మహిళా ఓటరు టీడీపీ నేతలు ఇచ్చిన వెయ్యి రూపాయలను విసిరి కొట్టినట్లు తెలిసింది.



14వ వార్డులో పద్మావతి ఆర్చ్‌ సెంటర్‌ ప్రాంతంలో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి పార్టీ గుర్తు ఉన్న స్టిక్కర్లతో పాటు రూ.2వేల నోట్లను పంపిణీ చేశారు. 15 వ వార్డు పరిధిలో నివసిస్తున్న బుడజంగాల ఓటర్లకు డబ్బులు పంచిపెట్టటం కనిపించింది. 18వ వార్డు పరిధిలో సాయంత్రం నుంచి వీధికి 5 మంది చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. 19వ వార్డులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు గ్రూపులు ఓటర్లకు నోట్లు ఇచ్చి సైకిల్‌కు ఓటెయ్యాలని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. 29వ వార్డులో ఇదే తరహా డబ్బు పంపిణీ జరిగింది. 41వ వార్డులో ఐరన్‌ బాక్సులతో పాటు నగదు ఇచ్చినట్లు రజకులు కొందరు చెప్పుకుంటూ వెళ్లటం కనిపించింది.

 

నంద్యాలకు భారీగా డబ్బు మూటలు..

ఓ వైపు కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తుంటే... మరో వైపు కొందరు పోలీసుల సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున డబ్బు మూటలు దిగినట్లు ఇంటలిజెన్స్‌ అధికారి ఒకరు చెప్పారు. నెల్లూరు నుంచి వస్తున్న ఓ వ్యానును ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా... వెంటనే ఓ మంత్రి నుంచి ఫోన్‌ రావటంతో ఆ అధికారి విడిచి వెళ్లిపోయినట్లు వెళ్లడించారు. అదే విధంగా మరో బొలేరో వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా అందులో ఉన్న టీడీపీ నాయకుడు బూతులు తిట్టినట్లు అధికారులు కన్నీరు పెట్టుకున్నారు.



రాజధాని నుంచి మరో వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా... డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఇలా అధికారపార్టీ నేతలు నంద్యాల ఓటర్లను కొనుగోలు చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం ఒక్కరోజే సుమారు 200 కోట్లకుపైగా నంద్యాలకు చేరుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. నంద్యాలలో నిబంధనలకు విరుద్దంగా కళ్లెదుటే డబ్బులు పంపిణీ చేస్తున్నా అధికారులు నోరెత్తలేని పరిస్థితి. నగదు పంపిణీపై ఎన్నికల సంఘం అధికారపార్టీ నేతలపై గట్టి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top