గుండెల్లో గుబులు

గుండెల్లో గుబులు - Sakshi


టీడీపీ, కాంగ్రెస్‌లకు అసంతృప్తుల బెడద  

కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై నేతల విమర్శలు

‘చింతా’ తీరుపై పార్టీలో వ్యతిరేకత

తెలుగుదేశం పార్టీలో సీనియర్ల కినుక

అల్లుడి జోక్యంపై అసంతృప్తి

రెండు పార్టీల అభ్యర్థుల్లోనూ ఆందోళన


 

తిరుపతి: తిరుపతి ఉపఎన్నికలో పోటీ అనివార్యమైంది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బరి నుంచి తప్పుకుంది. చివరకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల గోదాలో తలపడుతున్నాయి.  క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలపై ఓటర్లలో వెల్లువెత్తుతున్న తీవ్ర అసంతృప్తి అభ్యర్థులను ఆందోళకు గురిచేస్తోంది.

 

కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కినుక

 

నామినేషన్  గడువు చివరి రోజు మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన మబ్బు దేవనారాయణరెడ్డితోపాటు నగర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా మహిళాధ్యక్షురాలు ప్రమీలమ్మ వంటి నేతలు వ్యతిరేకిస్తూ నామినేషన్ కార్యక్రమానికి సైతం గైర్హాజరయ్యారు. మాజీ ఎంపీ చింతామోహన్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్నారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా అభ్యర్థి ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అనుచరులే పెదవి విరుస్తున్నారు.

 

అల్లుడి అత్యుత్సాహంపై అసంతృప్తి



ఇదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుగుణమ్మకు అసమ్మతి బెడద తప్పడం లేదు. వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అల్లుడు మితిమీరిన జోక్యాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనికితోడు నియోజకవర్గంలో ఉద్యోగుల నియమకాలకు సంబంధించి ఆరోపణలు, అప్పట్లో  సీఎంకు సైతం పార్టీ శ్రేణులు ఫిర్యాదులను చేశాయి. తిరుమల కొండపై నియమాకాలకు సంబంధించి గతంలో పార్టీ అభ్యర్థి అల్లుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికితోడు సీనియర్ నేతలు అంటీముట్లనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నేత చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ బోర్డు పదవి ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఈ రోజు రేపు అంటూ నియమాకాన్ని దాటవేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన లోలోపల చంద్రబాబు వ్యవహార శైలిపై రగిలిపోతున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో మహిళలు, పేదల్లో బాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చదలవాడకు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి, బ్రాహ్మణ సమాజానికి టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ సామాజికవర్గానికి పదవి ఇచ్చే విషయమై ఎక్కడా ప్రస్తావన తేలేదు. దీంతో వారు సైతం కినుక వహిస్తున్నట్లు  తెలుస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top