రణరంగం

రణరంగం - Sakshi


టీడీపీ సమావేశం రసాభాస

కొత్తపల్లి, బండారు వర్గీయుల బాహాబాహీ

విస్తుపోయిన పార్టీ పరిశీలకులు

వెనుదిరిగిన జిల్లా నేత తోట సీతారామలక్ష్మి  


 

 

నరసాపురం : తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం రణరంగంగా మారింది. కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. పార్టీ పరిశీలకుల సమక్షంలోనే బలప్రదర్శన చేపట్టారు. దీంతో విస్తుపోయిన ముఖ్యఅతిథులు ఏమి చేయాలో పాలుపోక దిగాలుగా కూర్చుండిపోయారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి వేదిక దిగి వెళ్లిపోయారు. కొత్తపల్లి పార్టీలో చేరిన తరువాత మొదటి సారిగా మహానాడు ఏర్పాట్లపై నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్ట్టీ పరిశీలకుడు  సి.హెచ్.రామచంద్రరావు, ఎమ్మెల్సీలు  రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంఏ షరీఫ్ హాజరయ్యారు.

 

రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. సహనం కోల్పోయిన కొత్తపల్లి సోదరులు

కొత్తపల్లి విజయవాడలో సీఎం సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన తొలి సమావేశం కావడంతో అటు ఎమ్మెల్యే ఇటు కొత్తపల్లి ఇద్దరూ దీనిని ప్రతిష్టాత్మకంగా భావించారు. బలప్రదర్శనకు దీనిని వేదికగా చేసుకున్నారు.  సమావేశానికి ఎమ్మెల్యే భారీ ర్యాలీతో రాగా, అనంతరం కొత్తపల్లి కూడా అనుచరగణంతో కాస్త ఆలస్యంగా వచ్చారు. కొత్తపల్లి రాకతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. జై కొత్తపల్లి అంటూ ఒకవైపు, జై బండారు అంటూ మరోవైపు కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో సమావేశం జరుగుతున్న స్థానిక తెలగా కల్యాణమండపం  వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొంది. మొదట ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఉయ్..ఉయ్ అంటూ కొత్తపల్లి వర్గం నుంచి కేకలు వినిపించాయి.



దీంతో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. క్రమశిక్షణతో లేకపోతే, ఇక్కడి నుంచి పోండని కొత్తపల్లి ఎదుటే ఆయన వర్గీయులను హెచ్చరించారు. దీంతో కొత్తపల్లి సుబ్బారాయుడు లేచి, ఎమ్మెల్యే చేతిలోని మైక్‌ను లాక్కున్నారు. మీవాళ్లనే కంట్రోల్ చేసుకోవాలంటూ చురకంటించారు. సుబ్బారాయుడు సోదరుడు జానకీరామ్ మాట్లాడుతూ ‘ఇక్కడ ఎవరూ గొప్పకాదు.. మనమంతా చంద్రబాబునాయుడు నాయకత్వంలో పని చేస్తున్నాం’ అని అన్నారు. జానకీరామ్ మాట్లాడేటప్పుడు బండారు వర్గం నుంచి ఏ..ఏ.. అంటూ కేకలు వినిపించాయి. దీంతో సమావేశం మళ్లీ వేడెక్కింది. వేదిక కింద ఉన్న కార్యకర్తలు నువ్వెంతంటే నువ్వెంతంటూ రెచ్చిపోయారు. తోపులాటకు దిగారు. ఎమ్మెల్యే సమావేశాన్ని రద్దు చేస్తున్నానని ప్రకటించి వేదిక దిగిపోయారు. ఎమ్మెల్సీ షరీఫ్, ఇతరులు బతిమాలి ఆయనను వేదికపైకి తీసుకొచ్చారు.  





పరువు తీయొద్దు : ఎమ్మెల్సీ షరీఫ్

సమావేశానికి పెద్దలుగా వచ్చిన నాయకులు ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయారు. ఓ దశలో ఎమ్మెల్సీ షరీఫ్ మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పరువు తీయొద్దని కార్యకర్తలను కోరారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ఏమీ చేయలేని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామమలక్ష్మి ప్రైవేటు సెక్యూరిటీ సాయం తో అతికష్టమ్మీద వేదిక దిగి వెళ్లిపోయారు.



 వెనుదిరిగిన తటస్థులు, మహిళా నేతలు

 పార్టీని నాశనం చేయడానికే కొత్తపల్లి వచ్చారని బండారు వర్గీయులు కేకలు వేయగా, ఎమ్మెల్యే స్థాయి మరిచి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కొత్తపల్లి వర్గీయులు ఆరోపించారు. పార్టీ పరువు బజారున పడటంతో కొంతమంది  కార్యకర్తలు ఇదెక్కడి గొడవంటూ, సమావేశం నుంచి వెళ్లిపోయారు. తమ్ముళ్ల తిట్ల దండకాలకు సిగ్గుపడిన కొందరు మహిళా నేతలు  మున్సిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల, డాక్టర్ ఎస్.ర్యాలక్ష్మి సమావేశం నుంచి నిష్ర్కమించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top