పచ్చ కలెక్టర్

పచ్చ కలెక్టర్ - Sakshi


అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదం

వారు చెప్పిన చోటే అభివృద్ధి పనులు

ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాల్లో పనులు నిల్

మంజూరైన పనులు సైతం రద్దుచేస్తున్న వైనం




సాక్షి, చిత్తూరు : జిల్లాలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడడమేగాక వివక్షకు తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాల్సిన  జిల్లా కలెక్టరే.. వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ నేతలు  సూచించిన నియోజకవర్గాలకు మాత్రమే పనులు మంజూ రు చేస్తూ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతి నిధులు ఉన్నచోట పనులిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఒకవేళ పనులు మంజూరు చేసినా  పచ్చపార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు చిటికెలో ఆ పనులను రాత్రికి రాత్రే రద్దుచేసి స్వామిభక్తిని చాటుకుంటున్నారు. కలెక్టర్ తీరును కిందిస్థాయి అధికారులే అసహ్యించుకునే పరిస్థితి దాపురించింది.



పలమనేరు నియోజకవర్గంలో దాదాపు 20 చెరువులకు సంబంధించి  రూ 1.18 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం  2014 సెప్టెంబర్ 13న ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసింది. పనులు ప్రారంభమయ్యాయి. ఇంతలో మార్చి 22న జిల్లా కలెక్టర్ ఆ పనులను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. పైగా ఆ నియోజకవర్గ పచ్చ చొక్కానేత ప్రతిపాదనలు, మంత్రి ఆదేశాల మేరకే పనులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతటితో వదలక అధికార పార్టీ నేత ప్రతిపాదించిన గ్రామాల్లోనే పనులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదీ జిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలకు, కలెక్టర్ తీరుకు ఓ ఉదాహరణ.



పలమనేరు  శాసనసభ్యుడు అమరనాథరెడ్డి  వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ శాసనసభ్యుడిగా  ఉన్నారు. ఇక్కడ అత్యధిక పంచాయతీల్లోనూ ఆ పార్టీ సర్పంచులే ఉన్నారు. ఇంకేముంది కళ్లుకుట్టిన దేశం నేతలు హుకుం జారీచేయడంతో ఘనత వహించిన కలెక్టర్ రాత్రికి రాత్రే   20 చెరువు పనులను  రద్దు చేశారు. దీంతో అమరనాధరెడ్డి ఆందోళనకు దిగారు. కలెక్టర్ తీరును తప్పబట్టారు. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 



ఒక్క పలమనేరే కాదు నగరి, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పీలేరు, పూతలపట్టు... జిల్లాలో   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లున్న  గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ  తెలిసో తెలియకో ఒకటీ అరా పనులు మంజూరు చేసినా పచ్చచొక్కాల నేతల ఆదేశాల మేరకు వాటిని రద్దు చేస్తున్నారు.



కింది స్థాయి అధికారులు వివక్షపూరితంగా వ్యవహ రిస్తేనో.. తప్పు చేస్తేనో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుం టారు. పార్టీ అధికారిగాగాక ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తారు. కిందిస్థాయి అధికారులను మందలించైనా సరే  వీలైనంతవరకూ అందరికీ  న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారిగాకాక అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న ఆ రోపణలున్నాయి. తాజాగా పలమనేరు చెరువు పనుల రద్దు  వ్యవహారంతో ఈ విషయం తేటతెల్లమైందని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు.



ఇదేమన్యాయమని  ప్రశ్నించేందుకు వెళ్లినా జిల్లా కలెక్టర్ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకపక్క కరువు, చేసేందుకు పనులు లేవు. అందరికీ పనులు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు  చెరువులను బాగుచేసుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని  ప్రభుత్వం, ముఖ్యమంత్రి  మైకులు పగిలేలా ఊదరగొడుతుండగా ఆయన సొంత జిల్లాలోనే అధికారపార్టీ నేతలు, అధికారులు కలిసి వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధిపనులే కాదు కొత్త పించన్లు,రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు సైతం కలెక్టర్ విముఖత వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top