ఇదేం రాజకీయం అన్నా...

ఇదేం రాజకీయం అన్నా... - Sakshi


ఓ రాజకీయ నేత చెలగాటం ... రోగులకు ప్రాణసంకటంగా మారింది. కంభం ఏరియా వైద్యశాల వ్యవహారంలో రాజకీయ పలుకుబడితో వైద్యులను సరిగ్గా పని చేయించనీయకుండా స్థానిక నేత పావులు కదపడంతో గిద్దలూరు, కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు చెందిన వేలాది రోగులు బలవుతున్నారు. రోజూ ఆరు వందల మంది రోగులకు వైద్యం ప్రసాదించే ఆ ఆ ఆసుపత్రి నేడు మందు బిళ్ల కూడా అందించలేకపోతోంది. వైద్యశాలలో ఐదుగురు రెగ్యులర్ వైద్యులు ఉండాల్సిన చోట ఒక్క రెగ్యులర్ వైద్యుడు కూడా లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో గిద్దలూరుకు వచ్చిన  కలెక్టరు సుజాతశర్మ దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో వైద్యవిధాన పరిషత్ కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్‌తో మాట్లాడిన డిప్యుటేషన్‌పై ఇక్కడకు రావడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి వారాలబ్బాయిలా వారానికొక వైద్యడు వచ్చి వెళ్లేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.

 

- గిద్దలూరులో టీడీపీ ముఖ్యనేత ఇష్టారాజ్యం

- నచ్చని ఉద్యోగులపై తెలుగు తమ్ముని బదిలీ వేటు

- వైద్యుడిని బదిలీ చేయించడంతో రోగులకు కష్టాలు

- వైద్యం అందక మూడు మండలాల ప్రజల అవస్థలు

గిద్దలూరు :
నాయకులు ఎక్కడైనా ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతారు. గిద్దలూరుకు వలస వచ్చిన ఓ నాయకుడు తన రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 2009లో గిద్దలూరులో, 2014లో కంభంలో వైద్యులను బదిలీ చేయించి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన ఆడిన రాజకీయ చదరంగంలో గిద్దలూరు, కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు చెందిన రోగులు బలవుతున్నారు. కంభం మండల కేంద్రంలో 30 పడకల వైద్యశాల ఉంది. ఏడాదిగా వైద్యులు లేక రోగులు, ప్రమాదాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయలేదన్న కక్షతో ఇప్పటి అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన అభ్యర్థి వైద్యశాల సూపరింటెండెంట్ రంగారావును దగ్గరుండి బదిలీ చేయించారు.



ఈయనకు తోడు మరో మూడు వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇక మిగిలింది దంత వైద్యుడు మాత్రమే. గుంటూరు- కడప, ఒంగోలు- కర్నూలు హైవేలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. అటవీ ప్రాంతం కావడంతో విష జ్వరాలు, పాము, కుక్క కాటు, అడవి జంతువుల దాడులు నిత్యం జరుగుతుంటాయి. ఇప్పుడు వైద్యులు లేక.. పేషెంట్లు రాక.. ఆస్పత్రి వెలవెలబోతోంది. ఇలాంటి వైద్యశాలకు డాక్టర్ రంగారావు వైద్య సేవలందిస్తున్న సమయంలో సుమారు 600 మంది వరకు నిత్యం రోగులు వచ్చే వారు.  

 

వైద్యుల నియామకంలో నిర్లక్ష్యం

అధికారం ఉందన్న అహంతో వైద్యులను బదిలీ చేయించిన అధికార పార్టీ నాయకులు తిరిగి ఆ స్థానంలో వైద్యులను నియమించడంలో విఫలమయ్యారు. రోగులకు విశేష సేవలందిస్తూ జిల్లా,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ డాక్టర్‌గా అవార్డులందుకొని పేదల మన్ననలు పొందిన డాక్టర్  రంగారావును నిర్దాక్షిణ్యంగా బదిలీ చేయించి తమకు వైద్యం అందకుండా చేశారని ప్రజలు, రోగులు వాపోతున్నారు. పంతం పట్టి బదిలీ చేయించిన నాయకుడు ఆ స్థాయి డాక్టర్‌ను నియమించేందుకు ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారు. కంభం, అర్థవీడు, బేస్తవారిపేట మండలాల నుంచి నిత్యం వచ్చే రోగులకు ఇప్పుడు వైద్యం అందిచే వారు కరువయ్యారు. రంగారావు బదిలీపై వెళ్లిన వెంటనే డాక్టర్ మురళీకృష్ణ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.



ఈయన స్వగ్రామం కనిగిరి కావడంతో వైద్యశాలకు సక్రమంగా రాలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గతంలో ఉదయం, సాయంత్రం రెండుపూటలా రోగులకు ైవె ద్యులు అందుబాటులో ఉండి సేవలు చేస్తుంటే నేడు మధ్యాహ్నానికే వైద్యశాల నిర్మానుష్యంగా మారుతోంది. రోగులకు సేవలందించే వైద్యుడిని బదిలీ చేయవద్దని ప్రజాసంఘాలు, మహిళలు, కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ర్యాలీలు, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఆ అధికార పార్టీ ముఖ్యనేత మనసు కరగకపోవడం గమనార్హం.

 

వైద్యుల కొరత

వైద్యశాలలో ఐదుగురు రెగ్యులర్ వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్క రెగ్యులర్ వైద్యుడు కూడా అందుబాటులో లేరు. ఉండేది కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ రంగనాయకులు, దంత వైద్యురాలు శిల్క్ తేజ. గైనకాలజిస్టు, చిన్నపిల్లల వ్యాధి నిపుణులు, మహిళా వైద్యురాలు లేకపోవడం వలన ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు కట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఆస్పత్రి సమస్యల నిలయంగా మారింది.

 

ఈ వారం వైద్యుడు రవీంద్రారెడ్డి

గత నెలలో గిద్దలూరు వచ్చిన కలెక్టర్ సుజాతశర్మకు కంభం వైద్యశాలలో వైద్యుల కొరత గురించి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో పాటు, బీఎస్పీ నాయకులు వివరించారు. స్పందించిన కలెక్టర్ మార్కాపురం వైద్యశాల నుంచి డాక్టర్లను డిప్యుటేషన్‌పై నియమించాలని వైద్యవిధాన పరిషత్ కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్‌ను ఆమె ఆదేశించారు. దీంతో డిప్యుటేషన్‌పై వచ్చేందుకు డాక్టర్‌లు ఒప్పుకోకపోవడంతో వారానికి ఒకరు చొప్పున నియమించారు. దీంతో గత వారం ఒక డాక్టర్ విధులు నిర్వహించగా ఈ వారం రవీంద్రారెడ్డి వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top