డ్వాక్రా రుణాలపైనా పన్ను!


హైదరాబాద్: 'రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే.. మహిళలకు అండగా ఉంటాం. ఆర్థికంగా వారిని ఆదుకుంటాం' ఎన్నికల ఓడ దాటక ముందు రాష్ర్ట మహిళా లోకానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఇప్పుడా ఓడ దాటాక ఎన్నికల హామీని తుంగలో తొక్కుతూ మహిళలకు అంతో ఇంతో ఆర్థిక చేయూతనిస్తున్న డ్వాక్రా రుణాలపైనా పన్ను వసూళ్లకు పావులు కదిపారు. ఫలితంగా ఒక మహిళ రూ.10 వేల రుణం పొందితే దీనిపై 1 శాతం చొప్పున సేవా పన్ను రూపంలో రూ.100 ప్రభుత్వ ఖజానాకు జమకానుంది. ఇదీ.. నవ్విపోదురుగాక.. నాకేటి.. అన్నట్టు చంద్రబాబు మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్న తీరు!!.

 

రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలపై సేవాట్యాక్స్ రూపంలో పన్నుల వసూళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం డ్వాక్రా బృందం తీసుకున్న మొత్తంలో ఒక శాతం చొప్పున సేవాపన్ను ప్రభుత్వ ఖజానాకు జమకానుంది. రాష్ట్రంలో మహిళా సాధికార సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు మరింత న్యాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు సంస్థను ఏర్పాటు చేసి కొత్త పన్ను వసూళ్లకు తెరలేపింది.



పన్ను వసూలుకు జీవో

సేవా పన్ను వసూలు చేసేందుకుగాను ఏపీ మహిళా సాధికార సంస్థ(ఏపీఎంఎస్‌ఎస్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ నిర్వహించే అన్ని లావాదేవీలపైనా గరిష్టంగా ఒక శాతం సేవాపన్ను వసూలు చేసుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఇన్నాళ్లూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలు నిర్వహిస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, రుణ పరపతి, నైపుణ్యాలు, స్వయం ఉపాధి తదితర సాధికార కార్యక్రమాలను ఇకనుంచి మహిళా సాధికార సంస్థ నిర్వహిస్తుందని జీవోలో స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం సెర్ప్‌కు నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు సంస్థలే నిధులను తమకు తాముగా సమకూర్చుకోవాలని సూచించింది. దీంతో సెర్ప్ నిధుల సేకరణ అవకాశాలపై బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో అధ్యయనం చేయించుకుని డ్వాక్రా మహిళలకు సెర్ప్ ద్వారా అందుతున్న రుణాలపై ఒక శాతం పన్ను వసూలు చేయవచ్చని సంస్థ సూచించింది. దీనికి తోడు సెర్ప్ నిర్వహించే ఇతర కార్యక్రమాలకు సేవా పన్ను వసూలు చేసుకోవాలని పేర్కొంది. సెర్ప్ ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయగా, ఆ నివేదికలోని అంశాలను ప్రభుత్వం ఇప్పుడు మహిళా సాధికార సంస్థ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది.



వచ్చే ఏడాది రూ. 85 కోట్ల భారం

రానున్న ఏడాదిలో డ్వాక్రా మహిళలకు రూ.7,378 కోట్లు రుణాలుగా ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికిగాను డ్వాక్రా మహిళల నుంచి రూ.74 కోట్లను సేవా పన్ను రూపేణా వసూలు చేయనుంది. స్త్రీ నిధి ద్వారా ఇప్పించే మరో రూ.738 కోట్ల రుణాలపై రూ.11 కోట్లు సేవా పన్నుగా వసూలు చేస్తారు. రానున్న ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు ఇప్పించే లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాల ద్వారా రూ.1,267 కోట్లను వసూలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.



విజయవాడ కేంద్రంగా సంస్థ

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికార సంస్థ విధివిధానాలను ప్రకటించింది. విజయవాడ కేంద్రంగా మహిళా సాధికార సంస్థను ప్రభుత్వం రిజిస్టర్ చేయనుంది. పేదరిక నిర్మూలన, సాధికారిత సాధించడం ఈ సంస్థ బాధ్యతగా నిర్దేశించింది.


  • గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారతకు సీఎం అధ్యక్షతన మంత్రులు, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.

  • ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మూలనిధిగా ఏర్పాటు చేసింది. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం, సంస్థ నిర్వహించే లావాదేవీలపై సేవా పన్ను ద్వారా నిధులను సమకూర్చుకోవాలని సూచించారు.

  • సంస్థ విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య, మానవ వనరుల, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

  • మహిళా సాధికార సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచేగాక దాతృత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది. సీఎస్‌ఆర్ నిధులను ఈ సంస్థ సేకరించుకోవచ్చు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top