టార్గెట్... సీజ్


సాక్షి ప్రతినిధి, కడప: ఆ ప్రజాప్రతినిధి అధికార దుర్వినియోగానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇందుకు యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఒక్కడి కోసం 48 మందిని టార్గెట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ‘ఎద్దు ఈనిందంటే దూడను గాటకట్టేయండి’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రషర్ మిషన్ అంటే సీజ్ చేయండి అన్నట్లుగా మసలుకుంటున్నారు.

 

 చట్టానికి ఎవరూ అతీతులుకారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే సంవత్సరాల తరబడి నిబంధనలను పాటించని అధికారులు ఒక్కమారుగా విరుచుకుపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఊహించని స్థితిలో ప్రజాప్రతినిధిగా ఎంపికై అధికారపార్టీలో భాగస్వామిగా ఉన్న నాయకుడి  టార్గెట్‌కు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు  ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

 

 అడ్డగోలుగా క్రషర్లు సీజ్....

 ‘రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవా’ అన్నట్లుగా కంకర మిషన్లు సీజ్ చేయాలనుకుంటే సవాలక్ష కారణాలు. అయితే నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశించారంటూ మైనింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు  విరుద్ధంగా ఉన్న క్రషర్ మిల్లులపై  క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు. కొన్ని క్రషర్లపై  విజిలెన్స్ కేసులు నమోదయ్యాయి. వీరు నామినల్ ఫైన్ చెల్లించి అప్పీళ్లకు వెళ్లారు.

 

 ఆ కేసులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మైనింగ్ అధికారులు హెచ్చరించాల్సి ఉంది. బకాయిలు చెల్లించేంతవరకూ రాయల్టీలు ఇవ్వమని నిరాకరించాల్సి ఉంది. అంతేకాకుండా డిమాండ్ నోటీసులు సైతం ఇవ్వాల్సిందిగా నిబంధనలు వివరిస్తున్నాయి. ఇవేవి పాటించకుండా ఏకంగా బకాయిలు ఉన్న  క్రషర్లు సీజ్ చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు.  ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 48 క్రషర్లును సీజ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ జిల్లాలోనే ఇది ప్రధమంగా మైనింగ్ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

 

 ఒక్కడి కోసం ఇంత చేయాలా..

 మేము మీ అనుచరులం కాదా.. రాజకీయంగా మీ టార్గెట్ ఆఒక్కడిపైనే కదా.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడ్తున్నారు. మనోళ్ల  మిషన్లు సైతం సీజ్ చేశారంటూ ఆ టీడీపీ ప్రజాప్రతినిధిని ఆయన అనుచరుడు ఒకరు నిలదీసినట్లు తెలుస్తోంది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన అయిన ఆ నాయకుడు అధికారం ఉందని అన్యాయంగా  కఠిన చర్యలకు పాల్పడకూడదని వాపోయినట్లు సమాచారం. బకాయిలు వసూళ్లు చేయాల్సిన పద్దతి ఇదేనా అంటూ మండిపడినట్లు తెలుస్తోంది.

 

  రాజకీయ ప్రత్యర్థి ఒక్కరినే టార్గెట్ చేస్తే పక్కాగా తెలుస్తుందని జిల్లా వ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించమని ఆనేత సలహా మేరకే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని పలువురు యజమానులు వాపోతున్నారు. పైగా క్రషర్  మిషన్లు సీజ్ చేస్తే  పైరవీలు చేయవద్దంటూ ఆ ప్రజాప్రతినిధి టీడీపీ నేతలకు  వివరించినట్లు సమాచారం. ప్రత్యర్థి 3.5 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని ఈ వ్యవహారంలో మీకు నష్టం కల్గితే దానిని చెల్లిస్తానని ఆ ప్రజాప్రతినిధి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.



 స్వల్ప మొత్తానికే కంకర మిషన్ సీజ్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, డిమాండ్ నోటీసు ఇస్తే  ఒక భాగం చెల్లిస్తామని కొంతమంది యజమానులు అధికారులకు మొరపెట్టుకున్నట్లు సమాచారం. అయితే సగం మొత్తం చెల్లించిన వారికే అవకాశం ఇవ్వాలనే దిశగా మైనింగ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మైనింగ్ యంత్రాంగం అడ్డగోలు చర్యలపై కొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. రాజకీయ కక్ష సాధింపు చర్యలను నియంత్రించేందుకు మరికొందరు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top