టార్గెట్ పీఆర్‌కే


సాక్షి ప్రతినిధి, విజయనగరం ః  మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను కుర్చీ నుంచి  దించేవరకు పట్టణ టీడీపీ నేతలు వదిలేటట్టు లేరు. ఆయనుంటే విజయనగరంలో పార్టీకి అప్రతిష్ట తప్పదని, ఇలాగైతే కష్టమే అన్న వాదనపై తెరపైకి తెచ్చారు. అంతటితో ఆగకుండా మూకుమ్మడిగా ఆరోపణలతో దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో జిల్లాకొచ్చిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదులు చేశారు. శనివారం కొందరు, ఆదివారం మరికొందరు ఫిర్యాదు చేసి ప్రసాదుల రామకృష్ణ పనితీరుపై ఏకరువు పెట్టారు. దీంతో అశోక్ గజపతిరాజు హుటాహుటిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌తో ప్రత్యేక భేటీ కావడమే కాకుండా కలెక్టర్‌ను పిలిచి మున్సిపాలిటీపై దృష్టి సారించాలని సూచించారు.

 

 ఆరోపణలివే...

 ‘50శాతం వీధిలైట్లు లేక చీకటిలోనే పట్టణ ప్రజలు సంక్రాంతి సంబరాలు   చేసుకున్నారు. మురికి కూపాల మధ్యే పండగ రోజులు గడిచాయి. పేరుకుపోయిన చెత్తాచెదారం, డ్రైనేజీ  నడుమ  పిల్లాపాపలతో పండగ చేసుకోవల్సి వచ్చింది. ఈ మూడు రోజులే కాదు గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా అభివృద్ధి పనులకు నోచుకోలేదు. ప్రగతి కుంటుపడిపోయింది. సిబ్బందిపై కనీస పట్టులేదు. అధికారులేం చేస్తున్నారో తెలియడం లేదు. ఎవరెక్కడ ఉంటున్నారో...ఎప్పుడు విధులకొస్తున్నారో తెలియడం లేదు. ఆక్రమణల తొలగింపుపై స్పష్టమైన ఆదేశాలివ్వలేకపోతున్నారు. మాకేంటి...నాకేంటి   ధోరణితో  పనిచేస్తున్నారే తప్ప అధికారులతో సమర్థంగా పనిచేయించలేకపోతున్నారు’ అని అశోక్‌కు ఫిర్యాదు చేశారు.  

 

 ఆయనకన్నా మున్సిపల్ వైస్ చైర్మనే బెటర్. అందరితో కలిసి ముందుకెళ్తున్నారని తెలిపారు.  అసలు రామకృష్ణ వద్దకు వద్దకు ఫైలు పట్టుకుని రావడానికి అధికారులు భయపడుతున్నారు. ఏమంటారో? ఎప్పుడెలా స్పందిస్తారో...అన్న భయం అధికారుల్లో నాటుకుపోయింది. పింఛన్లు,కార్పొరేషన్ల రుణాల దరఖాస్తులను కిందన పెట్టుకుని అందర్నీ ఊరిస్తారు. మేలు చేయకపోగా అవకాశాలను దూరం చేస్తున్నారని ఆరోపించారు.  ఇలాగైతే కష్టమే  అంటూ  మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణపై  శని, ఆదివారం   కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు  పట్టణ టీడీపీ నేతలు, పలువురు కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.  ఇదంతా ఎమ్మెల్యే మీసాల గీత ఎదుటే జరిగింది. ఫిర్యాదు చేసిన వారిలో వాళ్లూ, వీళ్లూ అన్న తేడా లేదు.   ఒకరిద్దరైతే ఆయన్ని ఆ పదవి నుంచి దించేయాలన్నట్టుగా మాట్లాడారు. దీనివెనుక కథేంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరెవరు మధ్య రగులుతుందో గత కొన్ని రోజులుగా చూస్తూ వస్తున్నదే.   ప్రసాదులను వ్యతిరేకిస్తున్న నాయకులందరికీ ఈ రెండు రోజులూ బాగా కలిసొచ్చాయి.

 

 మనసులో ఉన్నదంతా కక్కేశారు. దీంతో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కాసింత ఆశ్చర్యానికి లోనయ్యారు. నేతలు చెప్పినదంతా విని మాట్లాడదామంటూ ఆ సమయంలో దాట వేశారు.  కానీ, ఇంత దారుణమైన పరిస్థితులుంటే కష్టమే అన్న అభిప్రాయానికొచ్చారో, స్పందించకపోతే నష్టమని భావించారో తెలియదు గాని హుటాహుటిన మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ సోమన్నారాయణను పిలిచి ఆదివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు చేసిన ఫిర్యాదు అంశాలన్నీ ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ ఇద్దరే లోపల ఉండటంతో అశోక్ ఏ స్థాయిలో స్పందించారో బయటికి రాలేదు. కానీ కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వీరిద్దరితోనే కాకుండా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌ను కూడా పిలిచి మున్సిపాల్టీ పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. ప్రత్యేక దృష్టిసారించాలని, అవసరమైతే సీరియస్‌గా వ్యవహరించాలని సూచించినట్టు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మున్సిపల్ కమిషనర్‌ను పిలిచి కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. మరీ, ఈ ఎఫెక్ట్ ఎంతమేర ఫలితమిస్తుందో... పట్టణ పరిస్థితులు ఎంతమేరకు మెరుగుపడతాయో చూడాలి.   

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top