తమిళ వ్యాపారుల హల్‌చల్

తమిళ వ్యాపారుల హల్‌చల్

  • గంజాయి సాగుకు ప్రోత్సాహం

  • మన్యంలో తిష్టవేసి మరీ వ్యాపారం

  • పాడేరు: విశాఖ ఏజెన్సీ, ఏఓబీ సరిహద్దులో రెండు వారాల నుంచి తమిళనాడు గంజాయి వ్యాపారులు హల్ చల్ చేస్తున్నారు. గతంలో గంజాయి వ్యాపారంలో పేరొందిన పాత తమిళ వ్యాపారులు కూడా మళ్లీ గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు మండలాలు గంజాయి సాగుకు పేరొందాయి. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనూ భారీగా ఏటా సాగవుతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గంజాయికున్న డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది భారీ ఎత్తున సాగుకు వ్యాపారులు సమాయత్తమయ్యారు.



    ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో గిరిజనులతో గంజాయి సాగుకు అన్ని విధాలా వీరు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో మకాం వేసి, పెట్టుబడులకు సొమ్ము, ఎరువులు, క్రిమిసంహారక మందులను కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పెట్టుబడుల కోసం రూ.లక్షల్లో నగదును ఏజెన్సీకి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాలకు భారీగా ఇటీవల ఎరువుల బస్తాలు తర లించారు.



    మద్దిగరువు కేంద్రంగా ఎరువుల వ్యాపారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం గోతులు తవ్వి నారు పోసిన మొక్కలను నాటే పనుల్లో మారుమూల గిరిజనులు నిమగ్నమయ్యారు. తమిళనాడు వ్యాపారులు సమీప ప్రాంతాల్లో మకాం వేసి రోజువారీగా గంజాయి తోటలను సంరక్షిస్తున్నట్లు సమాచారం. పాడేరు పట్టణంలోనూ తమిళనాడు పాత గంజాయి వ్యాపారులు వారం రోజుల నుంచి అధికంగా సంచరిస్తున్నారు.



    పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, చింతపల్లి మండల కేంద్రాలో వీరు తిరుగుతున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు మాత్రం చిక్కడం లేదు. గత ఏడాది గంజాయి సాగును ఎక్సైజ్, పోలీసు శాఖలు పూర్తిస్థాయిలో అరికట్టలేనప్పటికి ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో విస్తృత దాడులు చేసి ఎండు గంజాయిని భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ రూ.కోట్ల విలువైన గంజాయి పట్టుబడటంతో తమిళనాడు వ్యాపారులు ఈ ఏడాది గంజాయి సాగు, రవాణా చేయాలన్న వ్యూహంతో ఉన్నట్టు తెలిసింది.



    తమిళ వ్యాపారులను ఏజెన్సీలో కట్టడి చేయనిపక్షంలో గంజాయి సాగు మరింత విస్తరించి అమాయక గిరిజనులు గంజాయి ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూశాఖలన్నీ సంయుక్తంగా ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top