నల్లధనాన్ని బయటికి తీయండి


యర్రగొండపాలెం: రుణాలు తీసుకొని ఎగవేసిన పారిశ్రామికవేత్తల నుంచి, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని బయటికి తీస్తే ఆ డబ్బుతో దేశంలో 3 వేల ప్రాజెక్టులు నిర్మించవచ్చని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. యర్రగొండపాలెంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చారు. ముందుగా పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు ఉద్యమ సార థి పూల సుబ్బయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.  వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కృషి చేసిన పూల సుబ్బయ్యను ఈ ప్రాంత ప్రజలు మరచిపోరన్నారు. ఈ ప్రాజెక్టు ఫైలును చూసిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరుపెట్టి నిధులు కేటాయించారన్నారు.



అటువంటి ప్రాజెక్టుకు డబ్బులు లేవనడం సరైంది కాదన్నారు. చైనా తరువాత ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో ప్రజల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పారిశ్రామికవేత్తలు రుణాలు తీసుకొని ఎగవేశారన్నారు.  రూ.72 లక్షల కోట్లు స్విస్ బ్యాంకులో నల్లధనం మూలుగుతోందనిన్నారు. ఈ నల్లధనంతో ప్రాజెక్టులు నిర్మిస్తే 2 వేల కోట్ల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.  అమెరికాలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఒబామా ఆర్థిక సలహాదారుడు భారతీయులే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కష పడుతుంటారని, అటువంటి దేశంలో గృహాలు లేక అల్లాడుతున్నారన్నారు. పెద్దపారిశ్రామికవేత్తలు అక్రమంగా దాచుకున్న డబ్బును వెలికితీస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 3 బెడ్ల ఇళ్లను కట్టించవచ్చన్నారు.

 

ఎరుపెక్కిన యర్రగొండపాలెం:

 సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా పట్టణంలోని  పుల్లలచెరువు బస్టాండ్ నుంచి  వైఎస్‌ఆర్ సెంటర్, త్రిపురాంతకం సెంటర్, కొలుకుల రోడ్డు మీదుగా వేదిక వద్దకు ర్యాలీ నిర్వహించారు. రెడ్‌షర్‌‌ట వలంటీర్లు కదం తొక్కారు.  ఈ సందర్భంగా చిన్నారులు వేసిన కోలాటం, ప్రజానాట్యమండలి సభ్యులు పాడిన విప్లవగేయాలు, లెనిన్ వేషధారి ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర  సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కె.అరుణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రానాయక్, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, రిటైర్డ్ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ షంషీర్‌ఆహ్మద్, పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందిని, గిద్దలూరు మార్కెట్‌యార్డు మాజీ అధ్యక్షుడు టీ రామ్మోహనరావు, ఆర్‌డీ రామకృష్ణ, మార్కాపురం మునిసిపల్ మాజీ చైర్మన్ జక్కా ప్రకాష్, మాజీ వైస్ చైర్మన్ అందె నాసరయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కరవది సుబ్బారావు, నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కేవీ కృష్ణగౌడ్, గురవయ్య పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top