వేట మొదలైంది

వేట మొదలైంది


భీమవరం/పెనుగొండ రూరల్/ ఏలూరు అర్బన్ :  జిల్లాను వణికిస్తున్న సైకోను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర వేట చేపట్టారు. వారం రోజులుగా విద్యార్థినులు, మహిళలకు ఇంజెక్షన్లు గుచ్చి పారిపోతూ జిల్లాను వణికిస్తున్న ముసుగు వ్యక్తి జాడ కనుగొనేందుకు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. గురువారం కోస్తా అడిషనల్ డీజీ ఆర్‌పీ ఠాగూర్, ఏలూరు రేంజి డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ భాస్కరభూషణ్ పలుచోట్ల తనిఖీలు చేశారు. సైకో ఆచూకీ కోసం జిల్లా అంతా జల్లెడ పట్టేందుకు 260 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు అడిషనల్ డీజీ ఆర్‌పీ ఠాగూర్ చెప్పారు. జిల్లాలోంచి బయటకు వెళ్లే అన్నిదారుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి కూడలిలో మఫ్టీలో పోలీసుల్ని ఉంచి వచ్చీపోయే వాహనాలపై కన్నేశారు. మరోవైపు ప్రతి వాహనాన్ని తనిఖీ జరుపుతున్నారు. కోస్తా అడిషనల్ డీజీ ఆర్‌పీ ఠాగూర్, డీఐజీ హరికుమార్, ఎస్పీ భాస్కరభూషణ్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లి సిబ్బందిని అప్రమత్తం చేశారు. పట్టణ ప్రాంతాలు, విద్యాసంస్థలు ఉండే ప్రధాన కూడళ్లలోపాటు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను కూడా నిత్యం పరిశీలిస్తూ సైకో కోసం గాలింపును ముమ్మ రం చేయాలని ఆదేశాలిచ్చారు.

 

బాధితుల ఇళ్లకు అడిషనల్ డీజీ


ఈ కేసుపై కోస్తా జిల్లా అడిషనల్ డీజీ ఆర్‌పి ఠాగూర్ ప్రత్యేక దృష్టి సారించారు. స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మత్తు ఇంజెక్షన్ బారిన పడిన విద్యార్థినులు, మహిళల ఇళ్లకు వెళ్లిన ఠాగూర్ వారిని పరామర్శించారు. బాధితుల నుంచి సమాచారాన్ని రాబట్టారు. ముసుగు వ్యక్తి ప్రవర్తించిన తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 22న యండగండిలో ఇంజెక్షన్ దాడికి గురైన మైపకు చెంది న విద్యార్థిని అందుకూరి మెర్సీని ఆమె ఇంటికి వెళ్లి ఠాగూర్ పరామర్శించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లోని కుముదవల్లి, పెన్నాడ తదితర గ్రామాలకు చెందిన ఇంజెక్షన్ బాధితులతో భీమవరం  సర్కిల్ కార్యాలయంలో సమావేశమై వారి నుంచి వివరాలను రాబట్టారు. కాగా, దొంగరావిపాలెంలో తనిఖీలను జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ గురువారం పర్యవేక్షించారు. పెనుగొండ ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు, మార్టేరులో సీఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో వచ్చీ, పోయే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు.

 

నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు




జిల్లాలో మహిళలపై ఇంజెక్షన్ సూదులతో దాడులు చేస్తున్న ఆగంతకుడిని సాధ్యమైనంత తొందరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ స్పష్టం చే శారు. గురువారం ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలకోడేరు, వీరవాసరం, ఉండి, అనంతపల్లి, పెనుగొండ పోలీసు స్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని దుండగుడు మోటా ర్ బైక్‌పై తిరుగుతూ విద్యార్థినులు, మహిళలే లక్ష్యంగా ఇంజెక్షన్ సూదులతో పొడిచి గాయపరుస్తున్నాడన్నారు. దుండగుడు వైరస్, బాక్టీరియా, డ్రగ్స్ నిండిన సూదులతో దాడులు చేస్తున్నాడనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

 

ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయన్నారు. దాడులు జరిగిన ప్రాంతాలలో సేకరించిన సూదులను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. వాటిలో ఎలాంటి హానికర వైరస్, బాక్టీరియా, డ్రగ్స్ లేవని తేలిందన్నారు. ఈ విషయంలో జిల్లా వాసులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నిందితుణ్ణి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, వివిధ ప్రాంతాల్లో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నిందితుని ఊహాచిత్రం రూపొందించి జిల్లా వ్యాప్తంగా ప్రద ర్శిస్తామన్నారు. దుండగుని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నగదును బహుమానం ఇస్తామని అడిషనల్ డీజీ ఠాగూర్ ప్రకటించా రన్నారు. అనుమానితులను గుర్తిస్తే 94407 96600 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top