టీచర్ ఎమ్మెల్సీలుగా సూర్యారావు, రామకృష్ణ

టీచర్ ఎమ్మెల్సీలుగా సూర్యారావు, రామకృష్ణ


కాకినాడ/గుంటూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు, టీడీపీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ విజయం సాధించారు. ఉభయగోదావరి జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతిచ్చిన పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమొక్రెటిక్ ఫ్రంట్) అభ్యర్థి రాము సూర్యారావు.. తన సమీప టీడీపీ ప్రత్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు.  చైతన్యరాజుపై సూర్యారావు 1,526 ఓట్ల అధిక్యం సాధించారు. గుంటూరు-కృష్ణా నియోజకవర్గ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ విజయం సాధించారు.  రెండు జిల్లాల్లో పోలైన 13,047 ఓట్లలో 12,672 ఓట్లు అర్హమైనవిగా నిర్ధారించారు. వీటిలో రామకృష్ణకు 7,146, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 5,383 ఓట్లు వచ్చాయి.

 

 

చైతన్యరాజు ఓటమిపై టీడీపీలో కలవరం

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఓటమి ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. బుధవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీహాలులో ఆ పార్టీ శాసనసభా పక్షం(టీడీఎల్పీ) భేటీ అయింది. ఈ సమయంలో  ఓటమి సమాచారం.. అధినేత  చంద్రబాబు సహా అందరినీ కంగుతినిపించింది. అరడజను మంది మంత్రులను, 40 మందికిపైగా ఎమ్మెల్యేలను ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా పంపినప్పటికీ చైతన్యరాజు ఓటమి పాలవడం వారికి షాకిచ్చింది. ఓటమి విషయంపై మాట్లాడుతూ.. చంద్రబాబు సంబంధిత నేతలపై మండిపడ్డారు.రూ.30 కోట్లకుపైగా ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదన్న అంశం నేతలందరినీ విస్మయానికి గురిచేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top