నగరంపై నిఘా నేత్రం

నగరంపై నిఘా నేత్రం

  • అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో నిఘా

  • రాత్రివేళల్లో దృశ్యాల నిక్షిప్తం

  • హైదరాబాద్ తరహాలో కంట్రోల్ రూమ్

  • తిరుపతి క్రైం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో నేరాలను అరికట్టడానికి, ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడానికి  పోలీసు శాఖ భారీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నేరస్తులను  గుర్తించడానికి, ఏదైనా సంఘటన  జరిగినప్పుడు  వేగంగా నేరస్తులను పట్టుకోవడానికి అత్యాధునిక  సీసీ కెమెరాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.



    గతంలో అర్బన్ ఎస్పీగా ఉన్న రాజశేఖరబాబు ప్రత్యేక చొరవ తీసుకుని పోలీసు శాఖ  నిధుల నుంచి  రూ.50 లక్షలు  వెచ్చించి అత్యాధునిక  టెక్నాలజీతో కూడిన ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ  సీసీ కెమెరాలను తెప్పించారు. తమిళనాడులోని  కోయంబత్తూరు నుంచి వచ్చిన 150  కెమెరాలను 150 జంక్షన్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుతో 100 మీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయితే గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు వీలుంటుంది. మంచి క్వాలిటీతో ఉండే ఈ కెమెరాలతో  రాత్రి వేళల్లో జరిగే దృశ్యాలను సైతం చిత్రీకరించవచ్చు.

     

    24 గంటలు పహారా  



    కెమెరాలను ఏర్పాటు  చేయడమే కాకుండా వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్‌లోని మూడో అంతస్తులో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హైదారబాద్ కమిషనరేట్‌లో ఉన్న విధంగానే  ఈ కంట్రోల్ రూమ్‌లో నిఘా ఉంటుంది.  క్రైం విభాగం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి  పోలీసు సిబ్బందిని  ఈ కంట్రోల్ రూముల్లో  విధుల్లో నియమించనున్నారు. ఆయా విభాగాల  సిబ్బంది వారివారి  విభాగాల కోణంలోనే  ఈకెమెరాలలోని దృశ్యాలను  విశ్లేషిస్తుంటారు. ట్రాఫిక్ సమస్యలపై కూడా నిఘా ఉంటుంది. రోడ్లపై  విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయి.  



    కంట్రోల్ రూమ్‌కు అదనపు బాధ్యతలు

     

    ఏదైనా వాహనం చోరీకి గురైతే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అనంతరం ఎలా చోరీ జరిగిందనే విషయం తెలుసుకోవాలంటే నేరుగా ఈస్టు పోలీసు స్టేషన్ భవనంలోని నూతన కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందిని కలిస్తే సరిపోతుంది. అక్కడున్న పెద్ద స్క్రీన్‌లో వాహనం పెట్టిన పాయింట్ ప్రాంతాలను సీసీ కెమెరాలు వీక్షిస్తే కచ్చితంగా నేరస్తుడిని గుర్తించవచ్చు.



    ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో పోలీసుల పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది.  కొత్తగా ఏర్పాటు చేయనున్న కంట్రోల్ రూమ్‌లో బాధితులు స్వయంగా కెమెరాలో వీక్షించుకునేలా అవకాశం కల్పించనున్నారు. తద్వారా నేర నిర్ధారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు.  వేగవంతంగా కొత్త సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top