చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే

చుండూరు కేసులో  సుప్రీంకోర్టు స్టే - Sakshi


విడుదలైన నిందితులకు నోటీసులు

 

న్యూఢిల్లీ: చుండూరు దళితుల హత్య కేసులో 123 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో దాఖ లైన అప్పీళ్లలో తదుపరి విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టులో కేసు తేలేం త వరకు ఆ అప్పీళ్లపై విచారణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు బుధవారం హైకోర్టును ఆదేశించిం ది. ఇదే సమయంలో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన 56 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీళ్లను ఎందుకు విచారణకు స్వీకరించరాదో.. ఆ తీర్పును ఎందుకు రద్దు చేయరాదో వివరించాలని ఆ 56 మందిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ సి.నాగప్పలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 1991 ఆగస్టు 6న గుం టూరు జిల్లా, చుండూరులో ఎనిమిది మంది దళితులు ఊచకోతకు గురయ్యారు.



దీనిపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్ 2007 జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. మిగిలిన వారిలో 21 మందికి యావజ్జీవం, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించా రు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలను లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు, అదే విధంగా శిక్ష పడిన 56 మంది తమ శిక్షను రద్దు చేయాలంటూ, నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిలో శిక్షపడిన వారు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన హైకోర్టు.. 56 మంది శిక్షను రద్దు చేస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు బాధితులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. హైకోర్టు అసలు ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద విచారణ చేపట్టలేదని, అందువల్ల ఆ చట్టం కింద కూడా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలంటూ బాధితులు సుప్రీంకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేశారు.



ఇదే సమయంలో 123 మందిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించడంపై దాఖలైన అప్పీళ్లను విచారించకుండా  హైకోర్టును ఆదేశించాలంటూ మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తం 4 అప్పీళ్లను విచారిం చిన సుప్రీం.. పై ఆదేశాలు జారీ చేసింది. కాగా,  చుండూరులో దళితుల ఊచకోత కేసులో నిందితులందరికీ ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద శిక్షలు విధించాలని సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు స్టే పట్ల ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు గుంటూరు జిల్లా పొన్నూరులో హర్షం వ్యక్తంచేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top