రైతుల పొట్టకొడుతున్నారు

రైతుల పొట్టకొడుతున్నారు - Sakshi


- పొగాకు బోర్డు చైర్మన్ - వ్యాపారుల మధ్య పోరులో అన్నదాతలు నలిగిపోతున్నారు

- వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి

ఒంగోలు టౌన్ :
పొగాకు బోర్డు చైర్మన్, వ్యాపారుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతూ నష్టపోతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయని విమర్శించారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.



ఈ ఏడాది వేలం ప్రారంభమై నాలుగు నెలలైనా ఇప్పటివరకు కేవలం 46 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. గత ఏడాది ఈ సమయానికి పొగాకు కొనుగోళ్లు పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన తరువాత వ్యాపారులు పొగాకు ధరలను మరింత తగ్గించేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులకు పోటీగా పొగాకు బోర్డును కొనుగోలు రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు.

 

రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై నాలుగు నెలలైనా సగటు ధర కిలో 106 రూపాయలు మాత్రమే వచ్చిందన్నారు. రైతులు వేలం కేంద్రాలకు తీసుకువస్తున్న పొగాకులో 30 నుంచి 40 శాతం నోబిడ్ పేరుతో వ్యాపారులు వెనక్కు పంపుతున్నారన్నారు. ఈ నెల 4వ తేదీ విజయవాడలో కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు రాయబారం వెళుతున్నామని, పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావాలని ఆయన కోరారు.



రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీ హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ జిల్లా నాయకురాలు ఎస్.లలితకుమారి, పొగాకు బోర్డు మాజీ సభ్యుడు మారెళ్ల బంగారుబాబు, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘ నాయకులు కృష్ణారావు, పి.కోటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ మండవ శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘ నాయకుడు పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘ నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీనివాసరావు, అయినాబత్తిన బ్రహ్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top