పేదల సేవే పరమావధిగా..

పేదల సేవే పరమావధిగా..


ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే పై ప్రాణాలు పైనే పోతాయనే భయం వెన్నాడుతుంటుంది. అక్కడి అపరిశుభ్ర వాతావరణం వల్ల కొత్త రోగాలు అంటుకుంటాయని జనం బెంబేలెత్తిపోతుంటారు. అక్కడ సిబ్బంది నుంచి వైద్యుల వరకూ అందరి చేతులూ తడిపితేనే గానీ వైద్యం అందదనే అవినీతి మరక ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్‌కు దీటుగా చేసేందుకు, సిబ్బందిలో క్రమశిక్షణ పెంచడంతోపాటు అవినీతిని పారదోలడం వంటి అంశాలపై దృష్టిపెట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఆసుపత్రిలోని ఏ విభాగంలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా పరిశీలించాలనుకున్నారు. అందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పలకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

 డాక్టర్ మోహన్ : ఏమ్మా.. ఈ ఆసుపత్రిలో మీరు గుర్తించిన ఇబ్బందులేమైనా ఉన్నాయూ.

 కె.జ్యోతి :  దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం ఓపీ సమయాన్ని పెంచితే బాగుంటుంది.

 డాక్టర్ మోహన్ : ఏమండీ.. మీ పేరేంటి. మీరు గుర్తించిన

 సమస్యలేమిటి.

 ఆర్.భవానీ, పాలకొల్లు : ఆసుపత్రిలోకి రావాలంటే ఆటోలు అడ్డుగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎటు తిప్పుతారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నాం.

 ఓపీ టికెట్లు ఇచ్చే ప్రాంతానికి వెళ్లిన సూపరింటెండెంట్

 మోహన్ అక్కడి మహిళలతో ఓపీ టికెట్లు తీసుకోవడంలో ఏమైనా ఇబ్బం దులు ఎదురౌతున్నాయా అని ప్రశ్నిం చారు. లేవని సమాధానం రావడంతో డయాగ్నోస్టిక్స్ విభాగానికి వెళ్లారు.

 డాక్టర్ మోహన్ : ఏపని మీద వచ్చారు. అందరూ నిలబడే ఉన్నారేంటి.

 ఎం.దుర్గ, గుడివాకలంక : రక్తం, కఫ పరీ క్షలు చేయించుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడ కూర్చోవడానికి ఏమీ లేకపోవడంతో నిలబడ్డాం.

 డాక్టర్ మోహన్ :  మీరూ పరీక్షలకే వచ్చారా.

 కాగిత మంగాపట్నం : ఔనండి. నమూనాలు ఇచ్చాం. ఫలితం రావడానికి సమయం పడుతుందన్నారు. కొన్ని రేపు ఇస్తామంటున్నారు. అన్ని ఫలితాలూ ఈ రోజే ఇచ్చేలా చూడండి.

 పరీక్షా కేంద్రం లోనికి వెళ్లిన సూపరింటెండెంట్‌ను రక్త, మూత్ర తదితర పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది, త్వరగా ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రశ్నించారు.

 డి.వెంకట్రావు, ల్యాబ్ టెక్నీషియన్ : చాలా పరీక్షల ఫలితాలు కొంతసేపటిలోనే ఇస్తున్నాం సార్. కొన్ని పరీక్షలకు సమ యం పడుతుంది. వాటిని త్వరగా ఇవ్వడానికి సాధ్యపడదు. అక్కడి నుం చి నవజాత శిశువుల విభాగానికి వెళ్లిన మోహన్ అక్కడి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న ఎముకల విభాగానికి వెళ్లారు.

 డాక్టర్ మోహన్ : చికిత్స బాగా జరిగిం దా. ఏమైనా ఇబ్బందులున్నాయా.

 వి.శ్యామలాదేవి  : వైద్యం బాగానే చేశారు. భోజనంలో నాణ్యత లేదు.

 డాక్టర్ మోహన్ :మీరు చెప్పండి. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి.

 కాట్రు సురేష్, ధర్మాజీగూడెం : శ్లాబ్ నుంచి నీరు కారి మంచాలపై పడుతోంది. చాలా ఇబ్బందిగా ఉంది.

 అక్కడి నుంచి ప్రధాన డ్రగ్ స్టోర్స్‌కు వెళ్లిన డాక్టర్ మోహన్ ‘రోగు లకు అవసరమైన మందులన్నీ ఉన్నా యా. స్వైన్ ఫ్లూ నివారణ మందులున్నాయా’ అని ప్రశ్నించారు.

 ఎం.ఇందిర : అన్ని మందులూ అందుబాటులో ఉన్నాయ్ సార్. స్వైన్ ఫ్లూ మందులు ప్రస్తుతం మనవద్ద లేవు.

 ప్రసూతి వార్డుకు వెళ్లిన మోహన్ ‘ఇక్కడ సిబ్బంది ఎలా చూస్తున్నారు. ఆపరేషన్ చేయడానికి ఎవరికైనా డబ్బులిచ్చారా’ అని అడిగారు.

 ఎం.రేవతి : బాగానే చూస్తున్నారు. ఎవరూ డబ్బు అడగలేదు.

 అక్కడి నుంచి మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లిన సూపరింటెండెంట్ ‘ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇంకా ఏమైనా చేయాలా’ని సిబ్బందిని ప్రశ్నించారు.

 బి.సుందరబాబు : సిబ్బంది బాగా తగ్గిపోయారు సార్. ఎంఎన్‌వోలు, స్ట్రెచర్ బేరర్లు లేకపోవడంతో వారి పనులు కూడా మేమే చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఆపరేషన్లు సమయానికి పూర్తి చేయలేకపోతున్నాం.

 డాక్టర్ మోహన్ : అది సరే.. ఇక్కడ ఆపరేషన్లు చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయ్.

 ఎం.సత్యనారాయణ : అలాంటిందేం లేదు సార్. ఎవరైనా సంతోషం కొద్దీ ఇస్తే తీసుకుంటున్నాం.

 డాక్టర్ మోహన్ : సంతోషంగా ఇచ్చినా తీసుకోవద్దు. అదే అలవాటై ఇవ్వని వా ళ్లను అడిగే పరిస్థితికి దిగజార్చుతుంది.

 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిబ్బందితో మాట్లాడుతూ ‘ఎక్కడైనా లోటు జరుగుతోందా’ అని అడిగారు.    

 జి.రంగమణి : ఇక్కడ చేరిన వారందరికీ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయ్ సార్. సెక్షనింగ్ (అన్ని బెడ్‌లకు ఆక్సిజన్) సౌకర్యం కల్పిస్తే మరింత త్వరగా సేవలందించే వీలవుతుంది.

 ట్రామా కేర్ సెంటర్‌ను సందర్శించి సేవలపై ఆరా తీశారు. ఏఎన్‌ఎంలతో మాట్లాడుతూ..

 డాక్టర్ మోహన్ : మీకేమైనా సమస్యలున్నాయా.

 ఏఎన్‌ఎంలు : వైద్య సేవలందించే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్న మాకు 5 నెలలుగా జీతాలు అందలేదు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. వెంటనే జీతాలు విడుదల చేయించడానికి చర్యలు తీసుకోండి సార్.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top