ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయ్

ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయ్


అనంతపురం అర్బన్:

 ‘అధికారంలోకి వచ్చామని అహంకారం.. మేం ఏం చేసినా ప్రశ్నించేవారులేరనే అహంభావం.. ఇది ప్రజాస్వామ్యమా..? లేక టీడీపీ నియంత రాజ్యమా..? మిమ్మల్ని ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయ్’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నేతలను హెచ్చరించారు. స్థానిక రెండో రోడ్డులోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం శంకరనారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, జిల్లా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పింఛన్ల జాబితా తయారీలో టీడీపీ నాయకులు చేస్తున్న నిర్వాకాన్ని బట్టబయలు చేస్తారనే భయంతో ఆ పార్టీ కార్యకర్తలు సాక్షి ఫొటోగ్రాఫర్ వీరేష్, పాత్రికేయుడు రమణారెడ్డిపై దాడి చేయడం అమానుషమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కులాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని, అయితే ప్రస్తుతం టీడీపీ నాయకులు వారి సానుభూతిపరులకు మాత్రం పింఛన్లు మంజూరుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమిష్టిగా పింఛన్ల జాబితా తయారు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు తయారు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన 135 జీఓ కేవలం పచ్చచొక్కాల కోసమేనా అని ఘాటుగా విమర్శించారు.  పింఛన్ల జాబితాల తయారీ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని, అర్హత ఉన్న వారికి అన్యాయం జరిగితే ప్రజలే వారిని నిలదీస్తారన్నారు. 50శాతం పింఛన్లు కోత విధించేందుకు ఇలాంటి సమావేశం నిర్వహించారని, వారి నిర్వాకాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధులపై ఎమ్మెల్సీ శమంతకమణి సమక్షంలో ఆమె కుమారుడి ఆధ్వర్యంలో దాడులు జరగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో సామాన్యులకు ఇక రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. పాత్రికేయులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ జేసీ దివాకరరెడ్డి టీడీపీలో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు నిత్యం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతుంటే... జీడిపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రభుత్వం భావించడం మూర్ఖత్వమేనన్నారు. సమావేశంలో జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాలరెడ్డి, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు పెన్న ఓబిలేసు, నగర యువజన నాయకులు మారుతినాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, ముక్తాపురం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top