ప్రాణాలు తీస్తున్న ఎండలు


వడదెబ్బతో ఏడుగురు మృతి

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

భయపెడుతున్న వడగాల్పులు

బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం

శుక్రవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


 

 సాక్షి నెట్‌వర్క్ : మండే ఎండలు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నాయి. వడగాల్పులు, ఎండ వేడిమికి తట్టుకోలేక శుక్రవారం జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉదయం తొమ్మిది గంటల కాక ముందు నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జం కుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వృద్ధులు, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. ఆళ్లగడ్డ పట్టణం ఎల్‌ఎం కాంపౌం డులో నివాసమున్న మాదము ఏలీశమ్మ (70) ఇలాగే అస్వస్థతకు గురయ్యారు.



కూలి పనికి వెళ్లిన ఆమెకు మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. శుక్రవారం కోలుకోలేక మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామానికి చెందిన కట్టుబడి శిలార్‌షా (65) కూడా ఇలాగే మృత్యువాత పడ్డారు. గురువారం పొలం దగ్గరకు వెళ్లి సృ్పహ తప్పిపడిపోగా.. గమనించిన కొందరు వైద్యశాలకు తరలించారు. ఊపిరి పీల్చుకోలేక శుక్రవారం ఆయన మృతిచెందాడు. శాంతినగరం గ్రామానికి చెందిన అనువాయమ్మ (70), చాగలమర్రి గుంతపాలెం కాలనీకి చెందిన రైతు ముల్లా అబ్దుల్ రషీద్ (55), చాగలమర్రిలోని బుగ్గరస్తా కాలనీకి చెందిన గౌస్‌బీ (70) కూడా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.



దేవనకొండకు చెందిన పింజారి లాలప్ప(55) ఉదయం తన పొలంలో పనిచేస్తూ.. ఎండవేడిమి తాళలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడని వైద్యులు చెప్పారు.  పాణ్యం గ్రామానికి చెందిన బాలన్న(75) కూడా వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. ఊర్లో పనులు లేక బతుకుతెరువు కోసం గుంటూరుకు వలస వెళ్లి నందవరం గ్రామానికి చెందిన లక్ష్మన్న వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు బయట ఎక్కువ సేపు తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గొడుగు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, మంచినీళ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top