సూర్యుడు.. చంపేస్తున్నాడు!

సూర్యుడు.. చంపేస్తున్నాడు!


హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడి ప్రతాపం శనివారం కూడా కొనసాగింది. వడగాలులు విపరీతంగా వీయడంతో గంట గంటకూ వడదెబ్బకు మరణించేవాళ్ల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు గజగజలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో చిన్నారులు, పెద్దలు, కూలీలు, వృద్ధులు, రైతులు వడదెబ్బ తీవ్రతను తట్టుకోలేక పిట్టల్లా రాలిపోయారు. ఖమ్మంలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.



వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో శనివారం మృతిచెందిన వారి వివరాలు జిల్లాల వారీగా..


  • అనంతపురం: యాకిడిలో ఏడేళ్ల బాలుడు జ్ఞానేశ్వర్ మృతి చెందాడు

  • కర్నూలు: బనగానపల్లె మండలం సైఫాలో ఓ మహిళ మృతి

  • కడప: రైల్వే కోడూరు మండలం రెడ్డివానిపల్లి దళితవాడలో గాలితొట్టి పెంచులమ్మ మృతి చెందింది

  • గుంటూరు: ఈ జిల్లాలో వడదెబ్బ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 9 మంది మృతిచెందారు. మృతులలో మంగళగిరి మండలానికి చెందిన ఓ వృద్ధుడు, క్రోసూరుకు చెందిన  పోతుగంటి జగన్నాథం(70) ఉన్నారు.

  • శ్రీకాకుళం: వీరఘట్టం మండలం కుంబిడిలో ఒకరు, సారవకోటలో  మరో వ్యక్తి మృతి చెందాడు.

  • విజయనగరం: భోగాపుర మండలం ముంజేరులో వడదెబ్బతో చందర్ రావు(67), దత్తిరాజేరు మండలం మానాపురంలో ఓ మహిళ మృతి చెందింది.

  • విశాఖపట్నం: జిల్లాలోని చీడికాడలో వడదెబ్బతో ఓ మహిళ సహా ముగ్గురు మృతిచెందారు

  • నెల్లూరు: ఈ జిల్లాలో వడదెబ్బ తీవ్రంగా ఉండటంతో 13 మంది మృతి. కావలిలో వడదెబ్బకు ఆరుగురు మృతిచెందారు. ఉదయగిరి మండలంలో మరో ఐదుగురు మృతిచెందారు.

  • ప్రకాశం: పొదిలిలో వడదెబ్బకు నాలుగేళ్ల చిన్నారి భారతి మృతిచెందింది. దర్శిలో అయితే ఏకంగా ఏడుగురు మృతిచెందారు. కొరివిపాడు మండలం మేదరమెట్లలో వడదెబ్బతో ఓ వృద్ధురాలు మృతి.

  • కృష్ణా: తిరువూరు మండలం మునికోళ్లలో ఉపాధిహామీ కూలీ మోహన్ (65), రాజుపేటలో రొయ్యల వైకుంఠరావు(70) మృతిచెందారు. కాకర్లలో దేవసహాయ(70) అనే వృద్ధుడు, నందిగామ మండలం జొన్నలగడ్డలో అనసూయమ్మ(65) అనే వృద్ధురాలు, గన్నవరం మండలంలో మరో వృద్ధురాలు, ఓ మధ్యవయస్కుడు మృతిచెందారు.




తెలంగాణలో వడదెబ్బతో మృతిచెందిన వారి వివరాలు జిల్లాల వారీగా..


  • కరీంనగర్: సిరిసిల్ల బీవై నగర్లో మాద్యం రామస్వామి (65) మృతి

  • నల్లగొండ: కేతెపల్లి మండలం గుడివాడలో ఓ వృద్ధుడు, చివ్వేంల మండలం గుంజనూరులో ఓ మహిళ మృతి

  • మెదక్: ఈ జిల్లాలో వడదెబ్బ ప్రభావంతో ఐదుగురు మృతిచెందారు

  • ఖమ్మం: భద్రాచలం రెవెన్యూ మండలం గట్టికల్లు శివారు తండాలో ఓ వ్యక్తితో పాటు, రాయపర్తిలో యాదయ్య(55), వర్ధన్నపేట మండలం దివిటిపల్లిలో కూలీ చిన్నయ్య మృతి

  • ఆదిలాబాద్: బెల్లంపల్లి మండలం మాలగురజాలలో ఓ వ్యక్తి మృతిచెందాడు

  • రంగారెడ్డి : హయత్ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో శనివారం వడదెబ్బతో యాదమ్మ(32) అనే మహిళ మృతిచెందింది.

  • మహబూబ్ నగర్: జిల్లాలో 5 మంది మృతిచెందారు


ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతోన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. శుక్రవారం రాత్రి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427 మంది మృత్యువాత పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top