నేటితో ఉత్కంఠకు తెర

నేటితో  ఉత్కంఠకు తెర


     నేడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

     చిత్తూరులో మూడు కేంద్రాల్లో కౌంటింగ్

     ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం

     ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు


 

సాక్షి,చిత్తూరు: పార్లమెంట్, అసెంబ్లీకి ఎవరు వెళ్తారనేది ఓటర్ల తీర్పు ద్వారా శుక్రవారం వెల్లడికానుంది. జిల్లాలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30.6 లక్షల ఓటర్లకుగాను 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి  మొత్తం 187 మంది అభ్యర్థులు ఉండగా, వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.



ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారు తమదే విజయమనే ధీమాతో లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా పోలైన ఓట్లు తీసుకుని వాటిలో తమకు ఎన్ని వచ్చుండచ్చుననే కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నారు. రాజంపేట పార్లమెంట్ హాట్ సీటుగా మారింది. వైఎస్సార్‌సీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో ఉన్నారు.



తిరుపతి లోక్‌సభకు వైఎస్సార్‌సీపీ నుంచి వరప్రసాద్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్, బీజేపీ అభ్యర్థి జయరామ్ మధ్య త్రిముఖ పోటీ ఉంది. చిత్తూరు లోక్‌సభకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సామాన్య కిరణ్, టీడీపీ నుంచి డాక్టర్ శివప్రసాద్ పోటీలో ఉన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు, జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.



సొంత జిల్లాలో ఒక్కసీటు అయినా గెలుస్తామా లేదా అని కిరణ్ అనుయాయులు, టీడీపీ ప్రతిష్టకు తగ్గట్టుగా గౌరవమైన సంఖ్యలో అసెంబ్లీలు గెలుస్తామా లేదా అని తెలుగుతమ్ముళ్లు కూడికలు తీసివేతల్లో మునిగి ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని, అత్యధిక స్థానాలు తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. విభజన సెగ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. ఎంత మాత్రం ఓట్లు వస్తాయనేది కూడా ఈ లెక్కింపులో తేలిపోనుంది.



కౌటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి :

 

చిత్తూరులో ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ కే రాంగోపాల్ సారథ్యంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ సందర్భంగా తలేత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు భెల్ కంపెనీ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారు.  కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌రూంల వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.  కౌంటింగ్ గేటు వద్ద సివిల్ పోలీసులు ఉంటారు.



కౌంటింగ్ కేంద్రాల బయట, రోడ్డుపై ఆర్ముడు రిజర్వు సాయుధ బలగాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు. ఎన్నికల సిబ్బందికి గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఎస్‌ఎంఎస్ ద్వారా నియోజకవర్గం కేటాయించారు. వీరు ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద గుర్తింపు కార్డులు తీసుకుని కౌంటింగ్ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top