కరువుపై డబుల్ గేమ్ !


చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో కరువు మండలాల ఎంపిక గందరగోళంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతూ దగా చేస్తోంది. కరువు ప్రకటిస్తే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వంకరువు మండలాలను కుదించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలోని 61 మండలాల్లో కరువు ఉందని తేల్చిన వ్యవసాయ శాఖ నివేదికను బుట్టదాఖలు చేసి 39 మండలాల్లో మాత్రమే కరువు ఉందంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వానికి కొత్త నివేదికను పంపింది. 

 

ఈ ఏడాది  తీవ్ర వర్షాభావం వల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు తగ్గింది. ప్రధానంగా వేరుశనగ పూర్తిస్థాయిలో సాగుకు నోచుకోలేదు. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 1,36,375 హెక్టార్లు, కాగా  ఖరీఫ్‌లో 1,12,633 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇక  27,705 హెక్టార్లలో సాగుకావాల్సిన చెరుకు 22,062 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఇక 15,365 హెక్టార్లలో సాగు కావాల్సిన వరి కేవలం 8,043 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఈ లెక్కన వర్షాభావంతో అన్ని పంటల సాగు విస్తీర్ణం  తగ్గింది. ఆ తరువాత జూలైలో వర్షాల జాడే లేదు. జూన్‌లో సాగైన వేరుశనగ పంట కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రం గా నష్టపోయారు. ఇదే సమయంలో జిల్లాలో 66 మండలాలకు గాను 61 మండలాలు కరువు పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయశాఖ జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వానికి నివేదించింది. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం తాజాగా ప్రభుత్వానికి పంపిన నివేదికలో కేవలం 38 మండలాల్లోనే మాత్రమే కరువుందని ప్రభుత్వానికి నివేదించింది. కరువు మండలాలను ప్రకటిస్తే  పశుగ్రాసం, సబ్సిడీ విత్తనాలు ఇవ్వాల్సి రావడంతోపాటు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది.



ఇది భారంగా భావించిన ప్రభుత్వం కరువు మండలాలను కుదించాలని జిల్లా అధికారులకు  ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఎక్కువ మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నా కొన్ని మండలాలను మాత్రమే జిల్లా అధికారులు కరువు మండలాల జాబితాలో చేర్చినట్లు తెలిసింది. జిల్లా రైతాంగం ఇప్పటికే వరుస కరువులతో కుదేలైంది. 2013లో 33 మండలాలలను కరువు కింద ప్రకటించారు. దీనికి సంబంధించి రూ.98 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. 2014లో 42 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది.  దీనికి సంబంధించి రూ.101 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. కానీ  ఇప్పటి వరకూ ఇన్‌పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది  కరువు మండలాలను ప్రకటిస్తే  మూడేళ్లకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే రైతులు చంద్రబాబు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top