సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళ


  •      భూముల విలువ పెరగనుందన్న సమాచారంతో రిజిస్ట్రేషన్ల జోరు

  •      అనకాపల్లిలో రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ

  •      ఒక్క రోజే 60 క్రయవిక్రయాలు

  • అనకాపల్లి/యలమంచిలి/రూరల్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల  ధరలు పెరుగుతాయనే ప్రచారంతో గత రెండు రోజులుగా అనకాపల్లి, యలమంచిలి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లతో రద్దీగా కనిపిం చాయి. అనకాపల్లిలో రోజుకు సరాసరి 20 రిజిస్ట్రేషన్లు జరగ్గా బుధవారం 50, గురువారం 60 రిజస్ట్రేషన్లు నమోదయ్యాయి.



    యలమంచిలిలో రెండు రోజుల్లో 300 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. చివరిరోజు కావడంతో గురువారం రెండు కార్యాలయాలు అమ్మకందారులు, కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి.  భూముల విలువ 30 శాతం పెరుగుతుందన్న సమాచారం మేరకు  రూ. 5 లక్షల విలువ ఉన్న భూమి రూ. 7 లక్షలకు,  రూ. 7లక్షల భూమి  రూ. 9 లక్షలకు పెరగనుంది. యల మంచిలి పట్టణంలో గజం స్థలం రూ.17 వందల నుంచి రూ.2200కు చేరనుంది.



    జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల విలువ కూడా గణనీయంగా పెరగనుంది. ఎకరా 5 లక్షల విలువ చేసే భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వానికి స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రు.30 వేలు చెల్లించాలి. పెరిగిన ధరలతో ఇది రూ.42 వేలకు చేరుతుంది. యలమంచిలిలో 100 గజాల స్థలానికి ప్రస్తుతం రూ.10,800 స్టాంప్‌డ్యూటీ చెల్లిస్తుండగా ఇకపై రూ. 13,200 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్‌ల విలువలు కూడా 30 శాతం పెంచడంతో ఈ ప్రభావం వాటి ధరలపై పడనుంది.

     

    సర్వర్ డౌన్‌తో టెన్షన్

     

    అనకాపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం కాసేపు సర్వర్ డౌన్ కావడంతో టెన్షన్ నెలకొంది. అనుకున్న అంచనా మేరకు రెండు రోజుల్లో రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు అవుతాయని భావించారు. గురువారం మధ్యాహ్నం నాటికి భూముల ధరల పెంపుదల నిర్ణయం ఇంకా ఖరారు కాకపోవడంతో వేగం తగ్గింది. అయినప్పటికీ రద్దీ కొనసాగింది. రాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగడమే పరిస్థితికి నిదర్శనం.

     

    కాస్త కదలిక

     

    ఏప్రిల్ నుంచి అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో లక్ష్యం మేరకు రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో సంబంధిత అధికారులు కలవరపడుతున్నారు. ఎన్నికల సందడిలో రెండు నెలలు గడిచిపోవడంతో కొంత నష్టం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోబోయే పాలసీలపై ఆధారపడి భూముల అమ్మకాల ప్రక్రియ జోరందుకుంటుందన్న అంచనాలు కొంత వరకు క్రయవిక్రయాలను దెబ్బతీశాయి.



    ఈలోగా రుణమాఫీపై స్పష్టమైన విధివిధానాలు రాకపోవడం, ఖరీఫ్ రుణాలు మంజూరు కాకపోవడంతో ఈ ప్రభావం భూముల క్రయవిక్రయాలపైనా కనిపించింది. మరోవైపు రాజధానిపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా పరిస్థితి మందగించడానికి కొంత కారణమైంది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో భూముల విలువ పెరుగుతుందన్న సమాచారం కాస్త కదలిక తెచ్చింది. రిజిస్ట్రేషన్లపై గణనీయమైన ప్రభావం చూపింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top