విద్యార్థుల భవితతో చెలగాటం

విద్యార్థుల భవితతో  చెలగాటం - Sakshi


కళాశాలకు అనుమతుల్లేకుండానే      విద్యార్థులకు బీఈడీ, డీఈడీ సీట్లు

విద్యాసంవత్సరం చివరిలో మొండిచెయ్యి

హాల్‌టికెట్లు రాక విద్యార్థుల ఆందోళన

తాజాగా మోసపోయిన డీఈడీ విద్యార్థులు

వినుకొండ ప్రాంతంలో  కళాశాలల అక్రమాలు!


 

ప్రైవేటు కళాశాలల ధన దాహానికి విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారుతోంది. వినుకొండ ప్రాంతంలో బీఎడ్, డీఎడ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా వచ్చి అనుమతుల్లేకుండానే విద్యార్థులను చేర్చుకుని చివరకు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఉన్నత స్థాయిలో చక్రం తిప్పుతున్న యాజమాన్యాల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా పెద్దసంఖ్యలో డీఎడ్ విద్యార్థులు మోసపోయారు. పరీక్షలు ప్రారంభమైనా వారికి హాల్‌టికెట్లు రాకపోవడంతో ఆందోళనకు దిగారు.

 

వినుకొండ రూరల్:  వినుకొండలో బీఈడీ కళాశాల ధన దాహానికి విద్యార్థులు మరోసారి బలయ్యారు. విలువైన రెండేళ్ల విద్యా సమయంతో పాటు రూ.లక్షల్లో నష్టపోయారు. ఈ ఏడాది ఆగస్టు చివరివారంలో బీఈడీ విద్యార్థులు, ఇప్పుడు డీఈడీ విద్యార్థులు.. ఇలా వరుసగా మోసపోతున్న వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. తాజాగా వినుకొండ పట్టణంలోని పలు డీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమైనా యాజమాన్యాలు హాల్‌టికెట్లు అందజేయలేదు. రెండు రోజుల నుంచి ఆందోళన చేసినా ఫలితం లేదు. సోమవారం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్ష మొదలైనా వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు.  

 

అనుమతి లేకుండానే అడ్మిషన్లు..


 ఈ ప్రాంతంలోని కొన్ని ఎడ్యుకేషన్ కళాశాలలకు అనుమతి లేకపోయినా ఉన్నతాధికారులతో లాలూచీ పడి తాత్కాలికి అడ్మిషన్లకు పర్మిషన్ తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. సాధారణంగా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు కళశాలల్లో చేరితే యాజామాన్యాలకు పెద్దగా మిగిలేది ఉండదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో బ్రోకర్లును ఏర్పాటు చేసుకుని విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విద్యాసంవత్సర కాలంలో ఒక్కసారి కూడా కళాశాలకు రానవసరం లేదు.. అడ్మిషన్, పరీక్షల సమయంలో వస్తే చాలు అంటూ ప్రచారం చేసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. తమ నివాసప్రాంతంలోనే ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్రమే హాజరై సర్టిఫికెట్ పొందొచ్చనే ఆలోచనతో కొందరు వీరి వలలో పడి రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. తీరా విద్యాసంవత్సరం ఆఖరులో హాల్‌టికెట్లు విడుదల కాకపోవటంతో విద్యార్థుల తర ఫున యాజమాన్యాలే కోర్టుకు వెళుతున్నాయి. ఇవేమీ తెలియని విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరటం, పరీక్షల సమయంలో కళాశాల వద్దకు చేరుకుని హాల్‌టికెట్ల కోసం ఎదురు చూడడం నిత్యకృత్యమైపోయింది. గత ఆగస్టు నెలలో వినుకొండలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కళాశాల వద్దకు వివిధ రాష్ట్రాల నుంచి రెండొందల మంది బీఈడీ విద్యార్థులు వచ్చి హాల్‌టికెట్ల కోసం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.



 యాజమాన్యాలు చెప్పిందే వేదం..

 రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలిగిన కళాశాలల యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై తమ పబ్బం గడుపుకొంటున్నాయి. పట్టణంలో పలు బీఈడీ, డీఈడీ కళాశాలలు ఒకే క్యాంపస్‌లో కనీసం నాలుగు పేర్లతో నాలుగు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. అందరికీ కలిపి ఒకే తరగతి గదిలో బోధిస్తుంటారనే వాస్తవం అందరికీ తెలిసిన బహిరంగా రహస్యమే. అమరావతి డీఎడ్ కళాశాల అమరావతిలో కాకుండా వినుకొండలో నిర్వహిస్తుండటంతో పాటు జీఎస్‌ఆర్, ఎస్‌ఆర్, సలాం ఇలా పలుపేర్లతో ఒకే క్యాంపస్‌లో డీబిఈడీ, డీఈడీ కళాశాలల తరగతులు నిర్వహిస్తున్నారు. ఎన్నోసార్లు విద్యార్థులు తాము మోసపోయాం అంటూ గగ్గోలు పెట్టినా ఇంతవరకు ఇక్కసారి కూడా విచారణ చేయకపోవటంలో ఆంతర్యం విద్యాశాఖాధికారులకే తెలియాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top