విష జ్వరాలతో విద్యార్థుల విలవిల


నందిగాం:  హరిదాసుపురం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని పదుల సంఖ్యలో విద్యార్థులు  రెండు వారాల నుంచి విష జ్వరాలు, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. సుమారు 40 మంది విద్యార్థులు ప్రస్తుతం పలాస, పూండి తదితర ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఈ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి (కృష్ణరాయపురం) తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలి సిందే. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా  ప్రభుత్వ వైద్యులు కనీసం స్పందించడం లేదని గ్రామస్తులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

 

ఈ పాఠశాలలో హరిదాసుపురం, ఆనందపురం, బోరుభద్ర, ఉప్పలపుట్టి, మాదిగాపురం, కామదేనువు, కృష్ణరాయపురం, కంచివూరు, పెద్దలవునిపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు గుంట యుగంధర్, దుంపల భవాణి, పినకాన ప్రేమకుమార్, గుంట ధనుంజయరావు, దుంపల భాగ్యలక్ష్మి, కంచరాన మౌళి, పినకాన హరి, బమ్మిడి హరి, హనుమంతు యామిని, కె.దివ్య, బి.అశ్విని, ఎస్.భాస్కరరావుతోపాటు సుమారు 40 మంది విద్యార్థులు ప్రస్తుతం జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. కొందరు పూండి, పలాస ప్రైవేటు ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సమస్యను పలుమార్లు వైద్యులకు తెలియజేసినా స్పందించ లేదని  విమర్శిస్తున్నారు.

 

 మూలకు చేరిన వాటర్ ప్లాంట్

 ఈ పాఠశాలకు స్థానిక యువ ఇంజనీర్లు సంకల్ప ట్రస్ట్ ద్వారా గత రెండేళ్ల కిందట వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు.  ఆరు నెలల నుంచి ఇది మూలకు చేరడంతో విద్యార్థులు బోరు, బావి నీటినే తాగుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు చెబుతున్నారు. మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండే ది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.   గ్రామంలో విద్యార్థులు వ్యాధి బారిన పడడంతో  సీపీఎం మండల నాయకుడు పాలిన సాంబమూర్తి గ్రామాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.  తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top