జల్సాలకు మరిగి.. విద్యార్థులే దొంగలై..


చోరీల కేసులో పట్టుపడ్డ ముగ్గురు విద్యార్థులు

28 తులాల బంగారు నగలు స్వాధీనం

మూడు చోట్ల చోరీలకు పాల్పడిన వైనం


 

 ప్రొద్దుటూరు క్రైం : విలాసాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ బావికాడి అబ్దుల్ షుకూర్, పల్లా అనిల్‌కుమార్, గంజికుంట హనుమంతుతోపాటు బంగారు కొనుగోలు చేసిన బడిమల గురస్వామిలను శుక్రవారం జమ్మలమడుగు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక త్రీటౌన్ పోలీస్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పూజితా నీలం వివరాలను వెల్లడించారు.



బుడ్డాయపల్లెలో నివాసం ఉంటున్న షేక్ బావికాడి అబ్దుల్‌షుకూర్ ఇటీవలే పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. వెంకటేశ్వర కొట్టాలకు చెందిన పల్లా అనిల్‌కుమార్ తిరుపతి ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గంజికుంట హనుమంతు ప్రొద్దుటూరులోని వేదవ్యాస డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. వీళ్లు ముగ్గురు మంచి స్నేహితులు. విలాసాలకు అలవాటు పడిన వీరు తరచూ కళాశాలలకు వెళ్లకుండా అల్లరిగా తిరిగే వారు. ముగ్గురు కలిసి మోడంపల్లెలో ఒక రూం కూడా బాడుగకు తీసుకున్నారు.



 మూడు ప్రాంతాల్లో చోరీలు..

 ముగ్గురు కలిసి పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. సూపర్‌బజార్ వీధిలో నివాసం ఉంటున్న షేక్ మహ్మద్ యాఖూబ్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న దస్తగిరిస్వామి పండుగ నిమిత్తం బుడ్డాయపల్లెలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న సుమారు 40 తులాల మేర బంగారు నగలను దుండగులు దోచుకొని వెళ్లారు. ఈ మేరకు త్రీ టౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే అదే వీధిలో నివాసం ఉంటున్న గంజికుంట ఆంజనేయులు ఈ నెల 20న ఉదయాన్నే బజారులోకి వెళ్లాడు.



అదే రోజు సాయంత్రం ఆయన భార్య సరుకులు తీసుకొని రావడానికి కిరాణా షాపునకు వెళ్లింది. అమె ఇంటికి వచ్చే సరికి బీరువాలో ఉన్న రూ. 45 వేలు విలువ చేసే 20 గ్రాముల బంగారు నెక్లెస్ కనిపించలేదు. అంతేగాక ఈ నెల 17న తిరుపతిలోని శివాలయం దగ్గరలో ఉన్న ఎల్‌ఎస్ నగర్ రోడ్డులో మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని పారిపోయారు. బ్యాగులో రూ. 1 లక్షా 50 వేలు విలువ చేసే 60 గ్రాములు కలిగిన రెండు బంగారు గాజులు, నల్లపూసల దండ ఉన్నాయి. ఈ మేరకు అదే రోజు తిరుపతిలోని ఎల్ ఆర్‌పల్లి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.



 ఇలా పట్టుపడ్డారు..

 అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు వారిని శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 6 లక్షల  75 వేలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ పూజితా నీలం తెలిపారు. పెద్ద మొత్తంలో బంగారును స్వాధీనం చేసుకొని కేసులను ఛేదిం చిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, జావీద్, ఏఎస్‌ఐలు మునిచంద్ర, హెడ్‌కానిస్టేబుళ్లు  అన్వర్‌బాష, శివరామిరెడ్డిలతోపాటు పీసీలు ప్రసాద్, గంగాధర్, చలపతి, ఆంజనేయులు శివనారాయణ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top