అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి


ఏలూరు(వన్ టౌన్) : ఏలూరు శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న వట్లూరు గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతోన్న విద్యార్థిని బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారు జామున ఐదు గంటలకు వాచ్‌మన్ ద్వారా విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు సమాచారం ఇవ్వడంతో దుర్ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దెందులూరు మండలం రామారావు గూడెంలో నివాసం ఉండే కస్సే రచన(16) పదవ తరగతి చదువుతోంది.



ఈమె తండ్రి కొండలరావు, తల్లి జ్యోతిలు వ్యవసాయ కూలీలు. విద్యార్థిని వారం రోజుల నుంచి వాంతులతో బాధపడుతోందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. తండ్రి కొండలరావు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇబ్బందులు పెడుతున్నాడని కొన్నిరోజుల క్రితం కుమార్తెతో చెప్పుకుని తల్లి కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో నాన్న ఇలా చేస్తున్నాడట.. నేనెందుకు బతకాలి.. చచ్చిపోతాను అంటూ పలుమార్లు ఏడ్వడంతో విషయాన్ని స్నేహితులు క్లాస్ టీచర్‌కు చెప్పారు. దీనిపై టీచర్ రచనను పిలిచి అడిగితే విషయం చెప్పి కన్నీరు పెట్టుకుందని, అలా చేయకూడదు బుద్ధిగా చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని చెప్పానని క్లాస్ టీచర్ చెబుతున్నారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే విద్యార్థిని ప్రాంగణంలోని పాఠశాలలో ఉన్న క్లాస్ రూంలో చున్నీకి వేలాడుతూ కన్పించింది.

 

కొన్నిరోజుల క్రితం పరీక్షలు దగ్గర పడుతున్నాయి నువ్వు కాస్త స్లోగా ఉన్నావు బాగా ఇంప్రూవ్ కావాలని టీచర్ చెప్పడంతో మనస్థాపానికి గురైందని కొంతమంది చెబుతున్నారు. జరిగిన సంగతి తెలుసుకుని హాస్టల్‌కు చేరుకున్న విద్యార్థిని బంధువులు మాకు చెప్పకుండా, మేము లేకుండా మృతదేహాన్ని తరలించడమేమిటి అని ఆగ్రహం వ్యక్తం చేసి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ, ఆర్డీవో, పట్టణ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు హాస్టల్‌కు చేరుకున్నారు.



మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాల్సిందేనంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు గంటలపాటు ఆందోళనకారులు జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అక్కడి నుంచి ఆందోళనకారులు ఆగ్రహంతో హాస్టల్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్‌లో చొరబడి కార్యాలయ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేయడంతో రికార్డు అసిస్టెంట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.



ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుర్ఘటన స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులను శాంతింపచేసి వారిందరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రచన మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు.

 

ప్రిన్సిపాల్ సస్పెన్షన్

రచన మృతదేహాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నంబూరి భారతి విధి నిర్వహణలో అలసత్వం వహించిన కారణంగా ఆమె సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. రచన మృతిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలంటూ ఆర్డీవో, డీఎస్పీలను ఆదేశించారు. దుర్ఘటన జరిగిన వెంటనే పరిస్థితిని పరిశీలించకుండా జాప్యం చేసిన త్రీ టౌన్ ఎస్సై పి.ప్రసాద్‌కుమార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీకి తరలించిన రచన మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ పరిశీలించారు. పోస్టుమార్టం నిర్వహించే డాక్టర్ల బృందంలో ఒక గైనకాలజిస్టును కూడా నియమిస్తున్నట్టు చెప్పారు.

 

అనుమానాలు ఎన్నో

రచన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఎస్లావత్తు రుక్మిణి కూడా ఇదే తరహాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురుకుల పాఠశాలలో వరుసగా సంఘటనలు జరగడం, విద్యార్థుల ఆత్మహత్య లేఖలు కూడా ఒకేలా ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

మా అమ్మాయిది ముమ్మాటికీ హత్యే

రామారావుగూడెం(దెందులూరు) : మా అమ్మాయి రచనది ముమ్మాటికీ హత్యేనని, ప్రిన్సిపాల్, నైట్‌వాచ్‌మెన్, నైట్ ఇన్‌చార్జి టీచర్‌ను సస్పెండ్ చేసి కేసును సీబీసీఐడీకి అప్పగించాల రచన తల్లిదండ్రులు కస్సే కొండలరావు, జ్యోతి, మేనమామ కాలి రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం తమకు ఫోన్ చేశారని, 7.10-7.15 గంటలకు తాము వచ్చేసరికే మా అమ్మాయిని గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు, ఉద్యోగులు వైద్యశాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు.



మా అమ్మాయి హాస్టల్ నుంచి వేరే భవనానికి వెళితే ఆ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న టీచర్, వాచ్‌మెన్‌లు ఏం చేస్తున్నారు? రాత్రి వేళల్లో బాలికల హాస్టల్‌లో పురుషులను నియమిస్తారా? మా అమ్మాయి ఉరి వేసుకుందని చెబుతున్నారు.. ఉరి వేసుకుంటే గది బయట తాళం ఎవరు పెట్టారు? పోలీ సులు, ఉద్యోగులు చెప్పే మాటలకు, జరిగిన సంఘటనకు ఏ మాత్రం పొంతన లేదనడానికి కొందరి పాత్ర ఉందనడానికి మా అమ్మాయి చనిపోయిన గది, బయట పెట్టిన తాళం నిలువెత్తు నిదర్శనమన్నారు. తమ కుమార్తె చనిపోయేంత పిరికిది కాదని, పూర్తి ఆరోగ్యంతో ఉందన్నారు. నిన్న కూడా తమతో ఫోన్‌లో నవ్వుతూనే మాట్లాడిందని, తెల్లవారేసరికి చనిపోయిందని చెప్పడం నమ్మలేకపోతున్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

 

నేతలు, బంధువులు, గ్రామస్తుల సంఘీభావం

రామారావుగూడెం గ్రామసర్పంచ్ పేరం మేరీకుమారి, పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, రచన బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి తరలివచ్చి తలిదండ్రులకు సంఘీభావం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top