అల... మృత్యు కౌగిలిలా...

అల... మృత్యు కౌగిలిలా... - Sakshi


► స్నేహితులను కబళించిన కెరటాలు

► ఉదయాన్నే గుడి నుంచి బీచ్‌కు చేరుకున్న బృందం

► ఫొటోలు తీసుకుంటుండగా లాక్కుపోయిన అల

► అతికష్టం మీద ప్రాణాలతో బయటపడిన ఇద్దరు

► విగతజీవిగా తీరానికి తిరిగొచ్చిన అమృత

► ఇంతవరకు ఆచూకీ లేని కల్యాణ్‌


పరీక్షలు అయిపోయాయి.. ఇక అంతా సరదాలు.. షికార్లే అని సంబరపడ్డారు..

తల్లిదండ్రులూ అలాగే అనుకున్నారు.. అందుకనే తమ పిల్లలు, వారి స్నేహితులు కలిసి గుడికెళ్తామంటే అడ్డుచెప్పలేదు..

కానీ ఆ క్షణంలో వారెవరూ ఊహించలేదు.. అదే ఆ పిల్లలకు చివరి ప్రయాణమని.. మృత్యువు కెరటాల రూపంలో కబళిస్తుందనీ!..

ఐదుగురు స్నేహితులు కలిసి గుడికెళ్లి.. అటునుంచి అటే జోడుగుళ్లపాలెం బీచ్‌కు చేరుకున్నారు.. ఇసుక తిన్నెలపై ఆడుకున్నారు.. ఆనక కెరటాలతో సయ్యాటలాడాలని.. ఫొటోలు దిగాలని ఉబలాటపడ్డారు.. ఆ ఉబలాటమే వారి ఉసురు తీసింది.

నలుగురు సముద్రంలోకి వెళ్లగా.. ఒకమ్మాయి ఫొటోలు తీయడానికి ఒడ్డునే ఉండిపోయింది. అంతలోనే రాకాసి అల వారిని తనలోకి లాక్కుంది..

ఇద్దరు రాళ్లగుట్టలను పట్టుకొని.. ఎలాగోలా మృత్యు కెరటం నుంచి తప్పించుకోగలిగినా.. నాచుపట్టి జారుగా ఉన్న రాళ్లు కల్యాణ్, అమృతల ప్రయత్నాలను విఫలం చేశాయి..

మృత్యుకెరటానికి వారిని అప్పగించాయి. అమృత విగతజీవిగా కొన్ని గంటల తర్వాత తీరానికి చేరుకోగా.. కల్యాణ్‌ ఆచూకీ లేకుండాపోయింది..

చేతికందొచ్చిన పిల్లలు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కలల ప్రతిరూపాలు అలల్లో కలిసిపోవడం ఆ రెండు కుటుంబాలతోపాటు వారి బంధువులను విషాద సముద్రంలోకి నెట్టేసింది.


సంద్రమంత విషాదం

► రాకాసి అలలకు యువతి బలి

► మరో యువకుడు గల్లంతు

► కొనసాగుతున్న గాలింపు చర్యలు  

సాగర్‌నగర్‌/పీఎం పాలెం (భీమిలి): రాకాసి అలలకు ఓ యువతి బలైపోయింది. మరో యువకుడు గల్లంతయ్యాడు. జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పోతినమల్లయ్యపాలెంకు చెందిన అమృత, శ్రీనిధి, మధురవాడ దరి మిథిలాపురి వుడా కాలనీకి చెందిన మోహన్‌ కల్యాణ్, రాజేష్, అనిల్‌ స్నేహితులు. వీరిలో రాజేష్‌ మినహా మిగిలిన వారంతా ఇటీవలే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు.


వీరంతా బుధవారం ఉదయం 8 గంటల సమయంలో జోడుగుళ్ల పాలెం శివాలయంలో స్వామిని దర్శించుకుని అనంతరం తీరానికి చేరుకున్నారు. అక్కడ కొంత సేపు కబుర్లు చెప్పుకున్నాక ఫొటోలు తీసుకునేందుకు తీరంలోని రాళ్లపైకి ఎక్కారు. ఫొటోలు తీసేందుకు శ్రీనిధి ఒడ్డున ఉండిపోయింది. ఆ సమయంలో బలమైన కెరటం రావడంతో అమృత, కల్యాణ్‌ రాళ్లపై నుంచి నీటిలోకి జారిపోయి గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరూ రాళ్లు పట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. ఫొటోలు తీసేందుకు ఒడ్డుకు వచ్చానని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని శ్రీనిధి విలపించింది.

రెండు కుటుంబాల్లో విషాదం

అమృత, కల్యాణ్‌ గల్లంతైన విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, మిత్రులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆరిలోవ పోలీసులు, మెరైన్‌ బృందాలు, గజ ఈతగాళ్లు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అమృత మృతదేహం గుడ్లవానిపాలెం తీరానికి కొట్టుకుని రావడంతో తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మోహన్‌ కల్యాణ్‌ జాడ ఇంకా తెలియకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్టు ఆరిలోవ సీఐ తిరుమలరావు తెలిపారు. ప్రాణాలతో బయటపడి షాక్‌కు గురైన రాజేష్, అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు.

గుండెలవిసేలా రోదనలు


అమ్మా తల్లీ... అమృత! శివాలయానికి వెళ్లి వస్తానని చెప్పి మమ్మల్ని వదిలేసి ఆ శివుని వద్దకే చేరుకున్నావా కూతురా అంటూ అమృత తల్లి అనీల రోదనలు చూపరుల హృదయాలను కలిచివేశాయి. పీఎం పాలెం రత్నగిరి హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసముంటున్న కలిదిండి ఎస్‌ఆర్‌కే  ప్రతాప్‌రాజుకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుండగా చిన్న కుమార్తె అమృత ఇటీవలే ఇంటర్‌ పరీక్షలు రాసింది. ఇంటర్‌ బాగా రాసినందుకు స్నేహితురాలు శ్రీనిధితో కలిసి జోడుగుళ్లపాలెంలోని శివాలయానికి వెళ్లింది. పీఎంపాలెం ప్రాంతానికే చెందిన శ్రీనిధి, అమృత 5వ తరగతి నుంచి టెన్త్‌ వరకు విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదువుకున్నప్పుడు మంచి స్నేహితులు. వీరిలో అమృత చనిపోవడంతో శ్రీనిధి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అమృత తండ్రి ప్రతాప్‌రాజుకు పీఎం పాలెం, మధురవాడ ప్రాంతాల్లో మంచి పేరు ఉండడంతో విషయం తెలుసుకుని వేలాది మంది ఆయనకు సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. తీరంలో గల్లంతైన మోహన్‌ కల్యాణ్‌ తండ్రి చిన్నారావు ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో నివసిస్తున్న అతనికి 9వ తరగతి చదువుతున్న కుమార్తె కూడా ఉంది. కుమారుడిని ఉన్నత చదువులు చదివించి మంచి స్థానంలో చూడాలనుకున్న చిన్నారావు బుధవారం ఉదయం పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గల్లంతైన కుమారుని కోసం ఎదురుచూస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top