ఒత్తిళ్లే కారణం


ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై తల్లిదండ్రుల ఆవేదన

కాలేజీ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్


 

విజయవాడ (లబ్బీపేట) : ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్న ప్రసాద్‌నాయక్ ఆత్మహత్యకు యాజమాన్యం ఒత్తిళ్లే కారణమని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసాద్‌నాయక్ మృతదేహానికి పంచనామా నిర్వహించే సమయంలో తండ్రి హమ్మునాయక్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రయోజకుడవుతాడని కళాశాలలో చేర్పిస్తే ప్రాణాలే పోయాయని, తమ కుమారుడి మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో విద్యార్థి సంఘాలు సైతం అక్కడకు చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీసులను ఆస్పత్రి ప్రాంగణంలో మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా, పోలీసులు మాత్రం సామరస్యంగా పోస్టుమార్టం పూర్తి చేసి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఉదయం రెండున్నర గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎట్టకేలకు తల్లిదండ్రుల ఆరోపణలను పంచనామాలో పేర్కొని పోస్టుమార్టం పూర్తి చేశారు.



న్యాయ విచారణ జరిపించాలి : పీడీఎస్‌యూ

ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాల విద్యార్థి ప్రసాద్ నాయక్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ నగర అధ్యక్షుడు జె.అశోక్, ఉపాధ్యక్షులు ఐ.రాజేష్, బి.శ్యాంసన్  తదితరులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతుని తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల్లో మార్కుల కోసం ఒత్తిడి చేస్తుండటం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పీడీఎస్‌యూ నాయకులను నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామంటూ హెచ్చరించటంతో వారు తీవ్ర ఆగ్రహంతో నినాదాలు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top